Boiler blast : పాకిస్థాన్‌లోని ఓ గమ్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. పంజాబ్ ప్రావిన్స్‌లోని ఫైసలాబాద్లోగల ఓ గమ్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా బాయిలర్ పేలిపోయింది. ఈ పేలుడులో సుమారు 15 మంది మృత్యువాతపడ్డారు. మరికొందరు గాయపడ్డారు. అయితే పేలుడుకుగల కారణాలు ఏమిటనేది ఇంకా తెలియరాలేదు.
కాగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా పేర్కొంది. పేలుడు అనంతరం ఫ్యాక్టరీ యజమాని పారిపోయాడు. స్థానిక పోలీసులు మేనేజర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పేలుడు దాటికి ఫ్యాక్టరీ భవనంతోపాటు చుట్టుపక్కల ఇల్లు కూడా పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై పంజాబ్ సీఎం మరయం నవాజ్ షరీఫ్ దిగ్బ్రాంతి వ్యక్తంచేశారు.
ఘటనా ప్రాంతంలో సహాయక చర్యలకు ఆదేశించారు. కాగా పాకిస్థాన్‌లోని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను గాలికి వదిలేయడంతోనే తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయిని స్థానిక మీడియా పేర్కొంటోంది. గత ఏడాది కూడా ఇదే ఫైసలాబాద్‌లో బాయిలర్ పేలుడు జరిగి 12 మంది మరణించారు. వారం క్రితం కరాచీలోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలోనూ పేలుడు సంభవించి నలుగురు మృతిచెందారు.