పాట్నా: తల్లి, ఆమె మూడేళ్ల కుమార్తె అదృశ్యమయ్యారు. అయితే ఇంటి సమీపంలోని చెట్ల పొదల్లో ఉన్న లగేజ్ బ్యాగ్‌లో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. (Girl Body Inside Luggage Bag) బాలిక తల్లి ఆచూకీని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. రాంబాగ్ ప్రాంతానికి చెందిన ఒక మహిళ, మూడేళ్ల కుమార్తెతో కలిసి ఒక ఫంక్షన్లో పాల్గొనేందుకు శుక్రవారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లింది. అయితే వారిద్దరూ ఇంటికి తిరిగి రాలేదు. భార్య మొబైల్ ఫోన్‌కు భర్త ప్రయత్నించినప్పటికీ అవుట్ ఆఫ్ రీచ్ అని వచ్చింది.
కాగా, ఆదివారం ఉదయం ఆ వ్యక్తి ఇంటి సమీపంలోని చెట్ల పొదల్లో లగేజ్ బ్యాగ్‌ను స్థానికులు గమనించారు. దానిని తెరిచి చూడగా చిన్నారి మృతదేహం అందులో ఉంది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారి హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే మొబైల్ ఫోన్‌ను ట్రాక్ చేయడం ద్వారా అదృశ్యమైన బాలిక తల్లి కాజల్ ఆచూకీని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.