ముంబయి, ఆగస్టు 21: ప్రముఖ బాలీవుడ్ నటుడు, బీజేపీ ఎంపీ సన్నీ డియోల్‌కు చెందిన విల్లా వేలం ప్రక్రియను బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) సోమవారం ఉపసంహరించుకుంది. సాంకేతిక సమస్యలు కారణంగా ఈ-వేలం నోటీసును రద్దు చేస్తున్నామని బీవోబీ ప్రకటన విడుదల చేసింది. బ్యాంకుకు చెల్లించాల్సిన దాదాపు రూ.56 కోట్ల రుణాన్ని ‘సెటిల్’ చేసుకునేందుకు సన్నీ డియోల్ ముందుకు వచ్చారని తెలిపింది. ఈ మొత్తం వ్యవహారంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పలు అనుమానాలు వ్యక్తం చేసింది. వేలం నోటీసును హఠాత్తుగా రద్దు చేయటాన్ని కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేశ్ తప్పుబట్టారు. బ్యాంక్ లోన్ తిరిగి చెల్లించని కారణంగా ముంబయిలోని సన్నీ డియోల్‌కు చెందిన ఓ విల్లాను వేలం వేయనున్నట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది.