న్యూఢిల్లీ, జూలై 2: వైద్య, ఇంజినీరింగ్ పరీక్షల్లో ప్రవేశం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగానే నిర్వహిస్తున్నారు. అయితే అడ్మిషన్ విధానంలో నీట్, జేఈఈ లాంటి ప్రవేశ పరీక్షలతో పాటు బోర్డు పరీక్ష మార్కులకూ సమానమైన ప్రాతినిధ్యం ఇవ్వాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో బోర్డు పరీక్షల మార్కులకూ 50 శాతం వెయిటేజీ (ప్రాధ్యానం) ఇవ్వాలనే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తున్నది. ఏ ఒక్క పరీక్షకూ అధిక ప్రాధాన్యత ఉండరాదన్న ఉద్దేశంతో ఈ అంశాన్ని పరిశీలిస్తున్నారు. అంటే వైద్య, ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు అయినా, బోర్డు పరీక్షలు అయినా ఆ ఒక్క పరీక్ష ఫలితమే విద్యార్థి భవిష్యత్‌ను నిర్ణయించరాదని, తద్వారా విద్యార్థిపై ఉండే విపరీతమైన ఒత్తిడిని తగ్గించాలని యోచిస్తున్నది.
ఇటీవల సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలో మూల్యాంకన లోపాలు, నీట్ ప్రశ్న పత్రాల లీకేజీ వంటి అక్రమాలు వెలుగుచూసి పరీక్షా విధానం విశ్వసనీయతపై దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసిన క్రమంలో ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ప్రస్తుతం వైద్య, ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కేవలం ప్రవేశ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగానే కల్పిస్తున్నారు. ప్రవేశ పరీక్షలకు అర్హత సాధించడానికి విద్యార్థులు ఆయా బోర్డు పరీక్షలో నిర్ణీత శాతం మార్కులు పొందితే సరిపోతుంది.