Artificial intelligence | శాన్ఫ్రాన్సిస్కో, జనవరి 10: అనుకున్నదే జరుగుతున్నది. కృత్రిమ మేధ(ఏఐ) రాకతో ఇంజినీర్ల కొలువులకు కష్టమే అనే ఆందోళనలు నిజమవుతున్నాయి. సాఫ్ట్వేర్ ఇంజినీర్లు రాయాల్సిన కోడింగ్‌ను ఏఐ రాసి పెడుతున్నది. దీంతో ఏఐ వినియోగాన్ని పెంచుతున్న సంస్థలు ఇంజినీర్ల సంఖ్యను తగ్గిస్తున్నాయి. ఈ దిశగా అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా పని చేసే సేల్స్‌ఫోర్స్ సంస్థ చేసిన ప్రకటన ఇంజినీర్లను కలవరపాటుకు గురి చేస్తున్నది.
ఈ ఏడాది తమ సంస్థలో కొత్తగా సాఫ్ట్వేర్ ఇంజినీర్లను నియమించుకోబోమని ఈ సంస్థ సీఈఓ మార్క్ బెనియాఫ్ ప్రకటించారు. తమ సంస్థకు చెందిన ఏఐ సాంకేతికత ‘ఏజెంట్‌ఫోర్స్’తో ఉత్పాదకత పెరిగిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓ పాడ్‌కాస్ట్‌లో చెప్పారు. ఇదే సమయంలో తమ ఏఐ ఆధారిత ఉత్పత్తుల ప్రయోజనాలను వివరించి, సేల్స్ పెంచడం కోసం వెయ్యి నుంచి రెండు వేల మంది కొత్త సేల్స్ ఉద్యోగులను నియమించనున్నట్టు తెలిపారు.
ఏఐ కేవలం సాఫ్ట్వేర్ ఇంజినీర్ల కొలువులే కాకుండా బ్యాంకు ఉద్యోగాలనూ దెబ్బకొట్టనున్నట్టు బ్లూమ్‌బర్గ్ ఇంటెలిజెన్స్ నివేదిక వెల్లడించింది. సిటిగ్రూప్, జేపీమార్గన్, గోల్డ్‌మాన్ శాక్స్ వంటి ప్రముఖ గ్లోబల్ బ్యాంకుల్లో 93 మంది చీఫ్ ఐటీ ఆఫీసర్లను సర్వే చేసి రూపొందించిన ఈ నివేదికను గురువారం విడుదల చేసింది. అంతర్జాతీయ బ్యాంకుల్లో కృత్రిమ మేధ వినియోగం పెరుగుతున్నందున రానున్న మూడు నుంచి ఐదేండ్లలో దాదాపు 2 లక్షల ఉద్యోగాలు తొలగించే అవకాశం ఉందని బ్లూమ్‌బర్గ్ పేర్కొన్నది.
మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 3 శాతం ఉద్యోగులు తగ్గొచ్చని తెలిపింది. మొత్తం ఉద్యోగుల్లో 5 నుంచి 10 శాతం తగ్గొచ్చని సర్వేలో పాల్గొన్న వారిలో నాలుగో వంతు మంది అభిప్రాయపడ్డారు. ఏఐ బోట్లు వినియోగదారులకు సేవలు అందించడం పెరుగుతుందని, దీంతో బ్యాక్ ఆఫీస్, మిడిల్ ఆఫీస్, ఆపరేషన్స్‌లో ఉద్యోగాలు చేసేవారికి ముప్పు ఎక్కువగా ఉందని బీఐ సీనియర్ అనలిస్ట్ థామస్ నోయెట్జెల్ తెలిపారు. రోజూ ఒకేరకమైన పనులు చేసే వారి ఉద్యోగాలు పోతాయని తెలిపారు.
ఏఐ ప్రభావం పెరిగినప్పటికీ మూడు రంగాల ఉద్యోగాలకు మాత్రం ఎలాంటి ముప్పు ఉండదని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు. ఇంధన, జీవసాంకేతికత, ఏఐ అభివృద్ధిలోని ఉద్యోగాలకు ఎలాంటి నష్టం ఉండదని ఇటీవల జరిగిన ఓ సదస్సులో ఆయన తెలిపారు. అయితే, ఏఐను ఆయన సమర్థించారు. ‘పని గంటలను తగ్గించి, సృజనాత్మక ఆలోచనలు చేసేందుకు ఏఐ మనకు అవకాశం కల్పిస్తుంది. ఏఐ వేగంగా పురోగతి చెందుతున్నది. ఏఐ నైపుణ్యాలు కలిగిన వారికి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి’ అని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు, ఏఐతో 9.2 కోట్ల ఉద్యోగాలు పోతాయని వరల్డ్ ఎకనమిక్ ఫోరం తాజా నివేదికలో వెల్లడించింది.