TATA Steel Plant | భువనేశ్వర్ : ఒడిశాలోని డెంకనాల్ జిల్లాలోని కంటామనియాలోని టాటా స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కంపెనీలోని స్టీమ్ పైప్ పగిలిపోయింది. దీంతో అక్కడ విధుల్లో ఉన్న 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్లాంట్‌లో ఉన్న హెల్త్ సెంటర్లో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం కటక్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. స్టీమ్ పైపు పగిలిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ధృవీకరించారు.
మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఈ ప్రమాదం సంభవించినట్లు కంపెనీ యాజమాన్యం వెల్లడించింది. ప్లాంట్‌లో తనిఖీలు జరుగుతున్న సమయంలో స్టీమ్ పైపు పగిలిపోయిందన్నారు. గాయపడ్డ వారిలో ఉద్యోగులు, కార్మికులు ఉన్నారని తెలిపారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం కటక్ తరలించామని స్పష్టం చేశారు. బాధితుల కుటుంబాలకు కంపెనీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.