కోహిమా: సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (AFSPA)ని తొలగించాలని నాగాలాండ్ సీఎం నేఫియు రియో డిమాండ్ చేశారు. ఈ చట్టం వల్ల దేశ ప్రతిష్ఠ మసకబారిందని విమర్శించారు. మన్ జిల్లాలో ఆర్మీ కాల్పుల్లో 14 మంది పౌరులు మరణించడంతో ఆ రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాగాలాండ్ సీఎం నేఫియు ఈ ఘటనను ఖండించారు. తీవ్రవాదులుగా పొరపడి పౌరులపై కాల్పులు జరిపిన ఆర్మీ యూనిట్‌పై కేసు నమోదుకు ఆదేశించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఈ అంశంపై ఆయన మాట్లాడారు. అమిత్ షా ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారని చెప్పారు. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (AFSPA)ని తొలగించాలని కేంద్రాన్ని కోరామన్నారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించినట్లు వెల్లడించారు. అనంతరం మరణించిన పౌరుల అంత్యక్రియల్లో ఆయన పాల్గొని నివాళి అర్పించారు.