Maithili Thakur : ఆధ్యాత్మిక, జానపద గీతాలను ఆలపిస్తూ మైథిలీ ఠాకూర్ (Maithili Thakur) సోషల్ మీడియాలో సంచలనం సృష్టించారు. ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో కూడా ఆమె రికార్డు నెలకొల్పారు. బీహార్ అసెంబ్లీ (Bihar Assembly) కి ఎన్నికైన అతిపిన్న వయస్కురాలిగా నిలిచారు. మైథిలీ ఠాకూర్ అలీనగర్ (Alinagar) నియోజకవర్గం నుంచి బీజేపీ (BJP) అభ్యర్థిగా రంగంలోకి దిగిన ఆమె.. ఆర్జేడీ దిగ్గజ నేత వినోద్ మిశ్రాను 11 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడించారు.
దాంతో తొలిసారి బీహార్ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. వాస్తవానికి 2008లో అలీనగర్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత బీజేపీ ఇక్కడ తొలిసారి జయకేతనం ఎగురవేసింది. ఇన్‌స్టా, యూట్యూబ్‌లో కలిపి ఆమెకు 1.1 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఫేస్బుక్లో అయితే 1.4 కోట్ల మంది ఆమెను అనుసరిస్తున్నారు. 2024లో శబరి మీద పాడిన ఆమె పాట ప్రధాని మోదీని ఆకర్షించింది. ప్రధాని ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు.
మైథిలీ ఠాకూర్ 2000 జూలై 25న మధుబనిలోని బేనిపట్టిలో జన్మించారు. ఆమె తండ్రి రమేశ్ ఠాకూర్ శాస్త్రీయ సంగీతకారుడు, గాయకుడు, టీచర్. తల్లి భారతి గృహిణి. రమేశ్ చిన్నప్పటి నుంచే కుమార్తెకు శాస్త్రీయ సంగీతం నేర్పించారు. ఆమె సోదరులు అయాచీ, రిషబ్ కూడా సంగీతం నేర్చుకున్నారు. ఆమె తన జానపద పాటలతో సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు.
తమ పిల్లల సంగీత సాధన ఇతరులకు ఇబ్బందిగా మారుతుండటంతో 17 సార్లు ఇళ్లు మారినట్లు మైథిలీ తల్లి భారతి ఓ సందర్భంలో మీడియాకు వెల్లడించారు. తాము చిన్న గదులను అద్దెకు తీసుకొని జీవనం సాగించినట్టు తెలిపారు. 2017లో ఎట్టకేలకు ఆ కుటుంబం సొంత ఇల్లు కొనుగోలు చేసింది. ఆ తర్వాత 2020లో ఓ అపార్ట్మెంట్లోకి మారారు. 2023లో ఎన్నికల కమిషన్ ఆమెను మధుబనికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికచేసింది. ఆ తర్వాత సంవత్సరమే ప్రధాని మోదీ అవార్డు అందజేశారు.