BJP | న్యూఢిల్లీ, అక్టోబర్ 13: భారతీయ జనతా పార్టీతో పొత్తు ప్రాంతీయ పార్టీలను ముంచేస్తున్నది. ఎన్డీఏలో చేరిన పార్టీల పరిస్థితి ధృతరాష్ట్ర కౌగిలిలోకి వెళ్తున్నట్టుగా మారింది. బీజేపీతో స్నేహం చేసినన్ని రోజులు బాగానే ఉంటుంది. ఒక్కసారి ఆ పార్టీకి కటీఫ్ చెప్పిన తర్వాత ప్రాంతీయ పార్టీల పుట్టి మునుగుతున్నది. శిరోమణి అకాలీదళ్, శివసేన(ఉద్ధవ్), అన్నా డీఎంకే పార్టీలతో మొదలుపెడితే తాజా ఎన్నికల్లో దారుణంగా ఓడిన పీడీపీ, జేజేపీ వరకు బీజేపీతో పొత్తు పెట్టుకొని దెబ్బతిన్న పార్టీలు చాలానే ఉన్నాయి. ఇక, పొత్తు లేకపోయినప్పటికీ బీజేపీతో సన్నిహితంగా మెలిగిన బీజేడీ, వైఎస్సార్సీపీ వంటి పార్టీలు కూడా మునిగిపోయాయి. దీంతో బీజేపీతో స్నేహం ఒక ఊబి లాంటిదని, ఒకసారి అడుగు పెట్టిన తర్వాత మునిగిపోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కోలుకోలేని విధంగా దెబ్బతిన్న పీడీపీ
2014లో జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో జమ్ము కశ్మీర్ పీపుల్స్ డెమాక్రటిక్ పార్టీ(పీడీపీ) 28 సీట్లు గెలిచి అతి పెద్ద పార్టీగా నిలిచింది. ఆ ఎన్నికల్లో ఎవరికీ మేజిక్ ఫిగర్ రాకపోవడంతో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సహజంగా కశ్మీర్ ప్రాంతంలో పీడీపీ బలంగా ఉంటుంది. బీజేపీతో స్నేహం కశ్మీర్ ప్రజలకు పీడీపీని దూరం చేసింది. దీంతో తాజా ఎన్నికల్లో పీడీపీ 28 సీట్ల నుంచి మూడు సీట్లకు పడిపోయింది. ఈ ఓటమి నుంచి పీడీపీ ఇప్పట్లో తేరుకునే పరిస్థితి కనిపించడం లేదు.
జేజేపీ పని ఖతం
2019లో జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మేజిక్ ఫిగర్ రాలేదు. దీంతో ఐఎన్ఎల్డీ నుంచి వేరు పడి ఏర్పడిన జన్నాయక్ జనతా పార్టీ(జేజేపీ) మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పుడే కొత్తగా పెట్టిన జేజేపీ ఆ ఎన్నికల్లో 10 స్థానాలు సాధించి కింగ్ మేకర్ అయ్యింది. నాలుగేండ్ల పాటు పొత్తు ప్రయాణం బాగానే సాగింది. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో సీట్ల పంపిణీ కుదరక పొత్తు విచ్ఛిన్నమైంది. ఆ తర్వాత జేజేపీ నుంచి కొందరు నేతలను చేర్చుకొని ఆ పార్టీని బీజేపీ దెబ్బ తీసింది. 2019లో జేజేపీకి గ్రామీణ ప్రాంతాల్లో మంచి ఆదరణ కనిపించింది. అయితే, రైతుల ఉద్యమం తర్వాత పరిస్థితి మారింది. బీజేపీతో కలిసి ఉన్న జేజేపీకి రైతులు దూరమయ్యారు. బలమైన రైతు ఓటు బ్యాంకు దూరమై ఈ ఎన్నికల్లో జేజేపీ దారుణంగా దెబ్బతిన్నది. ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది.
పాత మిత్రులూ మునిగిపోయారు
బీజేపీతో శివసేన పార్టీది దాదాపు మూడు దశాబ్దాల స్నేహం. అయితే, 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవి విషయంలో విభేదాలు తలెత్తాయి. బీజేపీకి దూరమైన శివసేన.. కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత శివసేనలో చిచ్చు రేగింది. ఆ పార్టీ నిలువునా చీలింది. బీజేపీ మద్దతుతో ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి అయ్యారు. పాత మిత్రపక్షం అని కూడా చూడకుండా బీజేపీనే శివసేనలో చిచ్చు పెట్టిందనే విషయం బహిరంగ రహస్యమే. ఇక, ఉత్తరాది, హిందీ ఆధిపత్యాన్ని వ్యతిరేకించి తమిళనాడులో బీజేపీతో పొత్తు పెట్టుకున్న అన్నా డీఎంకే కూడా ఉనికి కోల్పోతున్నది. గత ఎన్నికల ముందు తమిళనాడులో బీజేపీ కొంత బలపడిందనే పరిస్థితులు కనిపించాయి. దీంతో అన్నాడీఎంకేతో సుదీర్ఘ స్నేహాన్ని ఏమాత్రం మొహమాటం లేకుండా బీజేపీ వదులుకొని ఒంటరిగా పోటీ చేసింది. బీజేపీకి సుదీర్ఘకాలం మిత్రపక్షంగా ఉన్న శిరోమణి అకాలీదళ్ కూడా పంజాబ్లో కోలుకోలేని స్థితికి చేరుకుంది. పంజాబ్లో బీజేపీ ఉనికి పెద్దగా లేదు. దీంతో రైతుల ఉద్యమ ప్రభావం అకాలీదళ్పై పడింది. బీజేపీతో తెగదెంపులు చేసుకున్నప్పటికీ అప్పటికే ఆ పార్టీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
సన్నిహితంగా ఉన్న పార్టీలదీ అదే స్థితి
2019 నుంచి 2024 వరకు రాజ్యసభలో ఎన్డీయేకు తగినంత మెజారిటీ లేదు. దీంతో బిల్లులు పాస్ చేయించుకోవడానికి బీజేడీ, వైఎస్సార్సీపీ మద్దతు బీజేపీకి కీలకంగా మారింది. ఆ పార్టీలు కూడా బీజేపీతో సఖ్యతతో వ్యవహరించాయి. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలోనే ఈ రెండు పార్టీలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఒడిశాలో బీజేడీని బీజేపీ ఓడించింది. ఏపీలో టీడీపీతో కలిసి వైసీపీని ఓడగొట్టింది. తాజాగా మత కోణం ఆధారంగా వైసీపీని కోలుకోలేని విధంగా దెబ్బ తీసేందుకు బీజేపీ ఐటీ వింగ్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నదనని వార్తలు వస్తున్నాయి. ఈ పార్టీల పరిస్థితి చూస్తున్న రాజకీయ విశ్లేషకులు బీజేపీతో స్నేహం ధృతరాష్ట్ర కౌగిలి లాంటిదని అభిప్రాయపడుతున్నారు.