మొదటి దశ పోలింగ్ జరిగిన విధానాన్ని చూసి బీజేపీ అధిష్ఠానానికి గుబులు పుట్టుకుంది. యూపీపై పట్టు కోల్పోతున్నామన్న భయం తీవ్రమైంది. దీంతో ఏకంగా 200 మంది ముఖ్య నేతలను యూపీలో మోహరించాలని నిర్ణయించుకున్నారు. ఈ జాబితాలో ప్రధాని మోదీ కూడా ఉన్నారు. వీరందరూ ప్రజలను నేరుగా కలుసుకుంటూ.. తాము చేసిన పనులను వివరించాలన్న వ్యూహంతో ముందుకు కదులుతున్నారు. ఇదంతా కూడా మొదటి దశ పోలింగ్ సరళిని చూసిన తర్వాతే నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
అంతేకాకుండా పాదయాత్రలు, ర్యాలీలకు ఈసీ అనుమతించిన నేపథ్యంలో బీజేపీ ప్రచారంపై మరింత దృష్టి నిలిపింది. మొదటి దశలో పోలింగ్ శాతం తక్కువగా జరిగిందని, వచ్చే దశలో పోలింగ్ శాతం కూడా ఇలాగే వుంటే కార్యకర్తలు, నేతలు, శ్రేయోభిలాషుల్లో జోష్ తగ్గిపోతుందని, ఈ పరిస్థితి అధికార పీఠాన్ని చేజిక్కించుకునే వ్యూహంలో మోకాలడ్డుతుందన్న భయం బీజేపీలో నెలకొంది. దీంతో పోలింగ్ శాతాన్ని పెంచడంతో పాటు 200 మంది ముఖ్య నేతలను యూపీ ప్రచార సరళిలోకి దింపాలని బీజేపీ డిసైడ్ అయ్యింది.
ప్రతి దశలో మూడు సార్లు ప్రచారం చేయనున్న మోదీ
ప్రతి దశలో కూడా ప్రధాని మోదీ మూడేసి సార్లు ప్రచారం చేసేలా బీజేపీ వ్యూహం రచించింది. అంటే.. పరిస్థితిపై బీజేపీ ఎంత భయపడుతుందో అర్థం చేసుకోవచ్చు. అలాగే కేంద్ర మంత్రులు అమిత్షా, రాజ్నాథ్, అధ్యక్షుడు జేపీ నడ్డాతో సహా పలువురు కేంద్ర మంత్రులు కూడా తమకు కేటాయించిన ర్యాలీలు, సభల్లో పాల్గొనాల్సిందేనని అధిష్ఠానం తేల్చి చెప్పింది.