కోల్‌కతా: అదృశ్యమైన బీజేపీ కార్యకర్త ఆ పార్టీ కార్యాలయంలో హత్యకు గురయ్యాడు. (BJP Worker Body Inside Party Office) పార్టీ ఆఫీస్ డోర్ పగులగొట్టిన పోలీసులు లోపలకు వెళ్లి చూడగా రక్తం చారలతో ఉన్న అతడి మృతదేహం కనిపించింది. బీజేపీ కార్యకర్త హత్యకు సంబంధించి ఒక మహిళను అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఉస్థికి చెందిన బీజేపీ కార్యకర్త పృథ్వీరాజ్ నస్కర్ ఆ జిల్లాలో పార్టీకి చెందిన సోషల్ మీడియా ఖాతాలను నిర్వహిస్తున్నాడు. నవంబర్ 5 నుంచి అతడు కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
కాగా, పోలీసులు శుక్రవారం రాత్రి బీజేపీ పార్టీ కార్యాలయంలో లోపల నుంచి లాక్ వేసి ఉన్న ఒక డోర్‌ను పగులగొట్టారు. లోపలకు వెళ్లి చూడగా రక్తంతో తడిసిన పృథ్వీరాజ్ నస్కర్ మృతదేహం కనిపించింది. ఆయన మొబైల్ ఫోన్ కాల్స్ డేటాను పరిశీలించిన తర్వాత ఒక మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.
మరోవైపు ఆ మహిళను ప్రశ్నించగా పృథ్వీరాజ్‌తో ఘర్షణ సందర్భంగా పదునైన ఆయుధంతో దాడి చేసి హత్య చేసినట్లు ఒప్పుకున్నదని పోలీస్ అధికారి తెలిపారు. ఆమె ఎందుకు హత్య చేసింది, మృతుడితో ఆ మహిళకు ఉన్న సంబంధంపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. అయితే పృథ్వీరాజ్ నస్కర్‌ను టీఎంసీ కార్యకర్తలు హత్య చేశారని బీజేపీతోపాటు అతడి కుటుంబం ఆరోపించింది.