(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, అక్టోబర్ 18, (నమస్తే తెలంగాణ): వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మైనారిటీలు ప్రతిపక్షాలవైపు గంపగుత్తగా మొగ్గకుండా బీజేపీ ఇప్పటి నుంచే పాచికలు విసురుతున్నది. మైనారిటీల్లో చీలిక తెచ్చి ఒక వర్గాన్ని తనవైపు తిప్పుకొనే పని మొదలుపెట్టింది. ముఖ్యంగా ఉత్తరాదిలో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న పస్మండా ముస్లింలకు గాలం వేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ముస్లింలలో దిగువస్థాయి సామాజిక హోదా ఉన్నవారినే పస్మండాలు అంటారు. వీరు ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో అధికంగా ఉన్నారు. వారిని తమవైపు తిప్పుకొనేందుకు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో బీజేపీ మైనారిటీ సెల్ ఆదివారం ‘పస్మండా బుద్ధిజీవి సమ్మేళన్’ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది.
ముస్లిం సామాజిక వర్గంలో ఆర్థిక, సామాజిక, సాంస్కృతికంగా వెనుకబడిన వర్గాలు కొంతకాలంగా అస్థిత్వ పోరాటం చేస్తున్నాయి. ఈ వర్గాలను సమీకరించి ఒక వేదికపైకి తీసుకొచ్చి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నాన్ని ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ చేయలేదు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో గట్టెక్కడం దాదాపు అసాధ్యమని నిర్ణయానికి వచ్చిన బీజేపీ పెద్దలు.. మైనారిటీలను చీల్చే ఎత్తుగడ వేశారని రాజకీయ పండితులు అంటున్నారు. బీజేపీ అడుగడుగునా మైనారిటీ వ్యతిరేకతను బయటపెట్టుకొంటుండటంతో, ఆయా వర్గాలు ఇతర పార్టీలకు మద్దతిచ్చే అవకాశం ఉన్నది. దీంతో వారు గంపగుత్తగా ఏ పార్టీ వైపు మొగ్గుచూపకుండా బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు అనుమానిస్తున్నారు. ఈ వ్యూహానికి హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలోనే బీజం పడిందని చెప్తున్నారు. ముస్లింలో వెనకబడిన వర్గాలకు దగ్గర కావటం ద్వారా మైనారిటీల ఓటు బ్యాంకును చీల్చవచ్చని పార్టీ నేతలకు ప్రధాని మోదీ ఈ సమావేశంలోనే దిశానిర్దేశం చేశారని పేర్కొంటున్నారు.
పస్మండాలు ఎక్కువగా బంగ్లాదేశ్, పాకిస్థాన్ నుంచి వలస వచ్చిన వారే. పశ్చిమబెంగల్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీ, జమ్ముకశ్మీర్‌లో వీరు అధికంగా ఉంటారు. వీరిలో అన్సారీ, మన్సూరీ, కస్గర్, రయిన్, గుజ్జర్, ఘోశి, ఖురేషీ, ఇద్రిసీ, నాయక్, ఫకీర్, సయిఫీ, అల్వీ, సల్మనీ తెగలు ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో పస్మండాల జనాభా అధికంగా ఉన్నట్టు గుర్తించారు. ఇక్కడ ముస్లిం జనాభాలో 80 శాతం పస్మండాలే. ఎన్నికల్లో వీరు గెలుపోటములను ప్రభావితం చేయగలరు. 44 వేల పోలింగ్ బూత్‌లలో పస్మండా ఓటర్లు గణనీయంగా ఉన్నారు. ఆజంగఢ్, రాంపూర్‌లో ముస్లింల జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడానికి పస్మండాల మద్దతే కారణమని బీజేపీ యూపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు కున్వర్ బాసిత్ అలీ తెలిపారు. యూపీలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందే ముస్లింలలో 4.5 కోట్ల మంది పస్మండాలేనని ప్రభుత్వ అంచనా. లక్నోలో ఆదివారం నిర్వహించిన పస్మండా బుద్ధిజీవి సమ్మేళన్‌కు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బ్రజేశ్ పాఠక్ ముఖ్య అతిథిగా హాజరుకాగా, అదే సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర ఏకైక ముస్లిం మంత్రి ధనీశ్ అజాద్ అన్సారీ కూడా పాల్గొన్నారు. బీజేపీ మైనారిటీ సెల్ జాతీయ ప్రధాన కార్యదర్శి షబ్బీర్ అలీ ముఖ్యవక్తగా ప్రసంగించారు. ఇదే సామాజిక వర్గానికి చెందిన జమ్ముకశ్మీర్‌కు చెందిన గులామ్ అలీని ఇటీవల రాజ్యసభకు బీజేపీ నామినేట్ చేయగా, ఈ సమ్మేళన్‌లో సత్కరించారు.