Yusuf Pathan : పశ్చిమ బెంగాల్లో టీఎంసీకి చెందిన రెబల్ ఎంపీల వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. గతంలో బీజేపీకి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నందుకు టీఎంసీ ఎంపీ యూసుఫ్ పఠాన్ బెదిరింపులు ఎదుర్కొన్నారని టీఎంసీ నేత మహువా మొయిత్రా అన్నారు. గతంలో జరిగిన ఒక సంఘటనను శ్రీనగర్ ఎంపీ అగా సయ్యద్ రుహుల్లా మెహ్దీ గుర్తు చేసుకున్నారు. తాజాగా దీనిపై ఎక్స్ వేదికగా స్పందించారు.
ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. గత శీతాకాల సమావేశం సందర్భంగా సర్ సహా ఇతర కేంద్ర చర్యలకు వ్యతిరేకంగా పార్లమెంట్లో ప్రతిపక్ష ఎంపీలు నిరసన చేపట్టారు. ఇందులో టీఎంసీకి చెందిన యూసుఫ్ పఠాన్ కూడా ఉన్నారు. అప్పుడు ఒక పార్టీకి చెందిన ముస్లిం ఎంపీ యూసుఫ్ పఠాన్ వద్దకు వచ్చారు. యూసుఫ్ కనుక బీజేపీకి వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొంటే ఆయన ఇల్లు బుల్డోజర్తో కూల్చేస్తారని బెదిరించాడు. దీంతో భయపడిపోయిన యూసుఫ్ పఠాన్ అక్కడ్నుంచి వెళ్లిపోయి తన సీట్లో కూర్చున్నాడు. ఈ సమయంలో యూసుఫ్ పఠాన్ ముఖం భయంతో మాడిపోయింది. ఆయన చాలా భయపడిపోయారు. ఈ విషయాన్ని మెహ్దీ వెల్లడించగా.. దీనిపై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా కూడా స్పందించారు. ఆ ఎంపీ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అని వెల్లడించారు. ఈ సమయంలో తాను యూసుఫ్‌కు ధైర్యం చెప్పానన్నారు. ఒకవేళ బీజేపీ అలాంటి చర్యలకు పాల్పడితే పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
అయితే, అలాంటి యూసుఫ్ పఠాన్ కోసం తాను అండగా నిలిచానని, ఆయనకు ధైర్యం లేదని మహువా మొయిత్రా విమర్శించారు. ప్రస్తుతం టీఎంసీకి చెందిన 19 మంది ఎంపీలు రెబల్ గ్రూపులో చేరిన సంగతి తెలిసిందే. వారంతా తాము టీఎంసీ నుంచి వీడుతామని, తమను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ)లో విలీనం చేయాలని కోరారు. ఇందులో యూసుఫ్ పఠాన్ కూడా ఉన్నారు. దీనిపై లోక్‌సభ స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.