Assam Elections : అసోంలో ఏప్రిల్ 9న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ ప్రకటించింది. రాజధాని గుహవటిలో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో సీఎం హిమంత బిశ్వ శర్మ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ సైకియా తదితరులు మేనిఫెస్టో విడుదల చేశారు. సంకల్ప పాత్ర పేరుతో రూపొందిన ఈ మేనిఫెస్టోలో బంగ్లాదేశీయులను రాష్ట్రం నుంచి పంపించడంతోపాటు యూసీసీ చట్టంపై కూడా ప్రజలకు హామీ ఇచ్చింది.
మూడోసారి ఎన్నికైతే అసోం యాక్ట్ 1950 ప్రకారం రాష్ట్రం నుంచి బంగ్లాదేశీయులను తరిమేస్తామని సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. 24 గంటల్లోగా జిల్లా అధికారులతో కలిసి బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన వారిని పంపించేస్తామని ప్రకటించారు. ఒక్క అంగుళం భూమిని కూడా అసోం నుంచి వారికి ఇవ్వబోమన్నారు. అసోంలో యూసీసీ (యునిఫాం సివిల్ కోడ్) అమలు చేయడంతోపాటు, లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్‌ను అడ్డుకుంటామని హామీ ఇచ్చారు. రాబేయే ఐదేళ్లలో బంగ్లాదేశీ వలసదారులైన మియాల మూలాల్ని దెబ్బతీస్తామని చెప్పారు. మేనిఫెస్టోలోని కీలక అంశాలివి. ఐదేళ్లలో అసోంను వరదల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దటం. మొదటి రెండేళ్లలో వరదల నివారణ కోసం రూ.18,000 కోట్లు కేటాయింపు. యూసీసీకి సంబంధించి ఆరో షెడ్యూల్ ప్రకారం గిరిజన ప్రాంతాలను మినహాయిస్తారు.
శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రత్యేక దృష్టి పెట్టడం. ఐదేళ్లలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు. ఒరునోదయ్ స్కీం కింద ప్రస్తుతం మహిళలకు అందిస్తున్న రూ.1,250ని రూ.3,000కు పెంచుతారు. అలాగే రాష్ట్రంలో ఉచిత విద్యను అందిస్తారు. తేయాకు తోటల్లో పని చేసే కార్మికులకు రోజువారీ వేతనం రూ.500కు పెంపు. రవాణా రంగానికి రూ.5 లక్షల కోట్లు కేటాయింపు. ముఖ్యమంత్రి మహిళా ఉద్యమిత స్కీం కింద మహిళలకు రూ.25,000 ఆర్థిక సాయం. వన్ డిస్ట్రిక్, వన్ ఇనిస్టిట్యూషన్ మోడల్ కింద ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, ఒక యూనివర్సిటీ, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేస్తారు.