Rahul Gandhi | న్యూఢిల్లీ, జనవరి 23: నేతాజీ సుభాష్ చంద్రబోస్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. గురువారం నేతాజీ జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తూ ‘ఎక్స్’లో రాహుల్ గాంధీ ఒక పోస్ట్ చేశారు. దీనికి నేతాజీ ఫొటోను సైతం జత చేశారు. ఈ ఫొటోపై మరణించిన తేదీ ఆగస్టు 18, 1945 అని రాసి ఉంది.
ఈ తేదీన జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారనే ప్రచారంపై వివాదం ఉంది. విమాన ప్రమాదంలో ఆయన మరణించలేదని చాలామంది నమ్ముతున్నారు. దీంతో రాహుల్ గాంధీ పోస్ట్ వివాదంగా మారింది. నేతాజీని అవమానించినందుకు 24 గంటల్లో రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని కేంద్రమంత్రి సుకాంత మజుందార్ డిమాండ్ చేశారు. నేతాజీని దేశ మొదటి ప్రధానిగా ఆయన పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ట్వీట్ తప్పని, ఆమోదయోగ్యం కాదని తృణమూల్ కాంగ్రెస్ నేత కునాల్ ఘోష్ అన్నారు.