Karnataka | బెంగళూరు, అక్టోబర్ 27: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, రూ.50 కోట్లు, మంత్రి పదవి ఇస్తామంటూ తమ ఎమ్మెల్యేలకు ఆఫర్లు వస్తున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే గానిగ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం దేవనాగరిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ పేరు ప్రస్తావించకుండా ‘ఆ పార్టీకి చెందిన కొంతమంది నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలుసుకున్నారు.
ఎమ్మెల్యేలతో చర్చలు జరిపిన వారిలో బీఎస్ యెడియూరప్ప మాజీ వ్యక్తిగత కార్యదర్శి ఎన్ఆర్ సంతోష్ ఉన్నారు. భారీ మొత్తంలో నగదు, మంత్రి పదవి ఇస్తామంటూ ప్రలోభపెడుతున్నారు. ఈ విషయాన్ని మా ఎమ్మెల్యేలు నాకు చెప్పారు’ అని ఎమ్మెల్యే రవి తెలిపారు. ఎన్ఆర్ సంతోష్ జేడీ(ఎస్) తరఫున పోటీ చేసి ఓడిపోయాడని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నాడని, ఈ అంశాన్ని సీఎం, డిప్యూటీ సీఎంల దృష్టికి తీసుకెళ్లానని గానిగ రవి వివరించారు.