BJP | వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ భావిస్తోంది. గెలుపే లక్ష్యంగా పార్టీ బలంగా లేని లోక్‌సభ స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఏయే నియోజకవర్గాల్లో పార్టీ బలం తక్కువగా ఉందనే దానిపై ఓ జాబితాను సిద్ధం చేసిందని పార్టీ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గత ఎన్నికల్లో తమ అభ్యర్ధులు రెండు లేదా మూడో స్థానానికి పరిమితమైన 160 లోక్‌సభ స్థానాలను బీజేపీ గుర్తించింది. ఆయా స్థానాల్లో ఎన్నిక కోసం బీజేపీ ప్రత్యేక వ్యూహాలను రచిస్తోందని తెలుస్తోంది.
2024 లోక్‌సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ సన్నాహాలు ప్రారంభించింది. ఫిబ్రవరి 17, 18వ తేదీల్లో రాజధాని ఢిల్లీలో జరుగనున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పార్టీ అవలంబించబోయే వ్యూహాంపై చర్చించనుంది. మరోవైపు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కూడా ఖరారు చేసింది. మహాసభల అనంతరం పార్టీ తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రముఖ నేతల నియోజకవర్గాలలో ఈ సారి బీజేపీ కొత్త వారికి టికెట్లు ఇచ్చేందుకు వ్యూహం రచిస్తోందని బీజీపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. ఇందులో రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్, కనిమొళి, అభిషేక్ బెనర్జీ, అధీర్ రంజన్ చౌదరి తదితరులపై పోటీకి ముగ్గురు చొప్పున అభ్యర్థుల జాబితాను పార్టీ తయారు చేసిందని తెలింది. ఆ ముగ్గురిలో ఒకరిని ఫైనల్ చేసే అవకాశముంది. ముందుగా దక్షిణ భారత రాష్ట్రాల అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని, తెలంగాణలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై మహిళా మోర్చా అధికార ప్రతినిధి నడింపల్లి యమునా పాఠక్‌ను రంగంలోకి దించాలని పార్టీ నాయకులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఎస్. తిరువనంతపురం నుంచి శశి థరూర్‌పై మాజీ క్రికెటర్ శ్రీశాంత్‌ను పోటీకి దింపవచ్చని తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే 62 మంది అభ్యర్థుల పేర్లను జనవరి నెలాఖరులోనే విడుదల చేయాలని బీజేపీ అనుకుంది. కానీ జేడీయూ, అకాలీదళ్, రాష్ట్రీయ లోక్‌దళ్ తిరిగి ఎన్డీయేలోకి చేరే అవకాశం ఉండటంతో కొంత వెనక్కి తగ్గిందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే బిహార్‌లో ఆర్జేడీ మహాకూటమి నుంచి విడిపోయిన నితీశ్ కుమార్ తిరిగి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. మరో వైపు ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి కూడా NDA లో చేరుతున్నట్లు ప్రకటించారు. మరోవైపు అకాలీదళ్ కూడా ఎన్డీయేలో చేరుతుందనే చర్చ జోరుగా సాగుతోంది.
మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో గతేడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లోక్‌సభ ఎంపీలు, కేంద్ర మంత్రులను రంగంలోకి దింపి బీజేపీ కొత్త ప్రయోగం చేసింది. 21 మంది ఎంపీలను బరిలోకి దింపగా, అందులో 12 మంది మాత్రమే గెలుపొందారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఎంపీలకు మరోసారి అవకాశం ఇస్తుందా ? లేదా ? అనే ప్రశ్నలు ఆ పార్టీ నాయకులకే ఇంకా అంతుపట్టని విషయంగా మిగిలి ఉంది. ఓడిన ఎంపీలను వారి లోక్‌సభ నియోజకవర్గాల నుంచి మళ్లీ పోటీకి దింపడానికి బీజేపీ అధిష్టానం వెనుకడుగు వేస్తున్నదని పార్టీ వర్గాలు అంటున్నా.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను మళ్లీ పోటీకి దింపనుంది. ఈయనతో పాటు ప్రస్తుత కేంద్ర మంత్రులుగా ఉన్న రాజ్యసభ సభ్యులను కూడా రానున్న ఎన్నికల బరిలోకి దింపేందుకు పార్టీ వ్యూహం పన్నుతోంది.