Jarkhand CM : తనపై అసత్య ప్రచారం చేసేందుకు బీజేపీ (BJP) భారీ మొత్తంలో డబ్బులు ఖర్చు పెడుతోందని జార్ఖండ్ (Jharkhand) ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren) తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజల్లో విద్వేషాన్ని రగిల్చేందుకు బీజేపీ తీవ్రంగా యత్నిస్తోందని అన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాజపా తనపై చేసిన ఆరోపణలపై సీఎం ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా స్పందించారు.
ప్రజల్లో తనపై విద్వేషాన్ని వ్యాప్తి చేయడం కోసం కాషాయ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోందని, అందుకు రూ.500 కోట్లు ఖర్చు చేస్తోందని సోరెన్ ఆరోపించారు. ప్రజల మధ్య ద్వేషాన్ని రగిల్చి రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవడంలో బీజేపీ దిట్ట అని, తన ప్రభుత్వం గురించి బూటకపు ప్రచారం చేసేందుకు రూ.కోట్లు ఖర్చు చేసి 9 వేలకు పైగా వాట్సప్ గ్రూప్‌లను సృష్టించిందని విమర్శించారు.
కానీ, తాను జార్ఖండ్‌కు చెందిన బిడ్డనని, ఈ గడ్డపై అలాంటి సంస్కృతికి తావు లేదని, తాను అలాంటి పనులు ఎప్పటికీ చేయలేనని హేమంత్ సోరెన్ పేర్కొన్నారు. బీహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, బెంగాల్ నుంచి బీజేపీ కొందరిని ప్రచారానికి తీసుకొచ్చిందని, వారితో తనకు వ్యతిరేకంగా మాట్లాడించిందని, ఓటర్లను అయోమయానికి గురిచేసేందుకు ప్రయత్నించిందని ఆయన చెప్పారు. ఇవన్నీ బీజేపీ జిమ్మిక్కులని విమర్శించారు.
కాగా, జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల తొలివిడత పోలింగ్ ఇప్పటికే ముగిసింది. మొత్తం 81 స్థానాలు ఉండగా తొలివిడతలో 43 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మిగతా 38 సీట్లకు ఈ నెల 20న పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 23న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు.