లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్‌కు షాక్ ఇచ్చింది. ఆ రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. (UP Assembly Bypolls Result) మొత్తం 9 స్థానాలకు జరిగిన పోలింగ్‌లో ఏడు సీట్లలో గెలిచింది. కుందర్కి, ఘజియాబాద్, ఖైర్, ఫుల్పూర్, కతేహరి, మజ్హవాన్ స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ మిత్రపక్షమైన రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) మీరాపూర్ను సొంతం చేసుకున్నది. 2022లో గెలిచిన మూడు సీట్లను నిలుపుకోవడంతోపాటు కుందర్కి, కతేహరి స్థానాలను బీజేపీ దక్కించుకుంది. అలాగే మిత్రపక్షమైన నిషాద్ పార్టీ నుంచి ఆరవ స్థానాన్ని కూడా కైవసం చేసుకున్నది.
మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించిన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఈ ఉప ఎన్నికల్లో అంతగా రాణించలేకపోయింది. ఎస్పీ కంచుకోట కర్హాల్తోపాటు సిషామౌలో మాత్రమే ఆ పార్టీ విజయం సాధించింది. అయితే అధికారంలో ఉన్న బీజేపీ, పోలీసుల సహాయంతో ఎన్నికల్లో చీటింగ్‌కు పాల్పడినట్లు ఎస్పీ నేతలు ఆరోపించారు.