ప్రజలు విపక్షాన్ని మూడోసారి కూడా ఎందుకు తిరస్కరించారో ప్రతిపక్షాలు ఆత్మవిమర్శ చేసుకోవాలని బీజేపీ హితవు పలికింది. బీజేపీ ప్రభుత్వంపై ఎస్పీ చీఫ్, ఎంపీ అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలను బీజేపీ నేత షెహజాద్ పూనావాలా తోసిపుచ్చుతూ విపక్షంపై మండిపడ్డారు. తమను ప్రజలు మూడోసారి ఎందుకు తిరస్కరించారని ఆత్మవిమర్శ చేసుకోకుండా విపక్ష ఇండియా కూటమి అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.
ఓటమి పాలైనా ఆ పార్టీ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. మరోవైపు లోక్సభ ఎన్నికల్లో కీలక హిందీ రాష్ట్రం యూపీలో బీజేపీకి భంగపాటు ఎదురవడంతో ఎన్నికల ఫలితాలపై కాషాయ పార్టీ మేథోమథనం నిర్వహించింది. ఎన్నికల్లో మెరుగైన సీట్లు రాకపోవడానికి అగ్నిపథ్ స్కీమ్, పేపర్ లీక్స్, రాజ్పుత్లలో అసంతృప్తి వంటి పది కారణాలను పార్టీ గుర్తించింది.
యూపీలో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోవడానికి దారితీసిన పలు అంశాలను 15 పేజీల నివేదికలో రాష్ట్ర పార్టీ చీఫ్ భూపేంద్ర చౌధరి వివరించారు. అధిష్టానానికి పంపిన ఈ నివేదికలో పార్టీ పరాజయానికి కారణాలను ఆయన ప్రస్తావించారు. యూపీలోని 80 లోక్సభ స్ధానాల పరిధిలో 40000 మంది పార్టీ కార్యకర్తల నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్ ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. యూపీలో 80 లోక్సభ స్ధానాలకు గాను బీజేపీ కేవలం 33 స్ధానాల్లో విజయం సాధించింది.
Read More :