న్యూఢిల్లీ, జూన్ 17: లోక్‌సభ స్పీకర్ పోస్ట్‌ను తమ వద్దే ఉంచుకోవాలని బీజేపీ భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు సోమవారం తెలిపాయి. మిత్రపక్షాలకు ఆ పార్టీ డిప్యూటీ స్పీకర్ పదవిని ఆఫర్ చేయొచ్చని వెల్లడించాయి. ఈ విషయమై బీజేపీనాయకుడు రాజ్‌నాథ్ సింగ్ జేడీయూ, టీడీపీతో చర్చలు జరిపినట్టు సమాచారం. ఈ నెల 26న స్పీకర్ ఎన్నిక జరగనుంది.
ముందు రోజు మధ్యాహ్నం వరకు స్పీకర్‌గా పోటీ చేసే అభ్యర్థులకు మద్దతు ఇచ్చే ప్రతిపాదనలను సమర్పించవచ్చు. అయితే తమకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వకపోతే స్పీకర్ పదవికి ఒక అభ్యర్థిని బరిలో నిలపాలని ఇండియా కూటమి భావిస్తున్నది. స్పీకర్ అభ్యర్థి నిర్ణయంపై ఎన్డీయే కూటమిలో అంతర్గతంగా చర్చిస్తామని.. అభ్యర్థి ఖరారయ్యాక కూటమిలోని పార్టీలన్నీ ఆ అభ్యర్థినే బలపరుస్తాయని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ తెలిపారు.