Ramchandra Jangra | న్యూఢిల్లీ, మే 24: హర్యానాకు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు రామచంద్ర జంగ్రా పహల్గాం ఉగ్రదాడిలో భర్తను కోల్పోయిన వితంతు మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ భర్తల ప్రాణాల కోసం ఉగ్రవాదులను బతిమాలడానికి బదులుగా వారితో పోరాడి ఉండాల్సిందంటూ ఆయన ఆ మహిళలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
దేవి అహిల్యాబాయి హోల్కర్ జయంతి సందర్భంగా హర్యానాలోని భివానీలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో జంగ్రా ప్రసంగిస్తూ ‘పహల్గాంలో మహిళలు రాణి లక్ష్మీబాయి లేదా అహిల్యాబాయి హోల్కర్ లాగా తెగువ ప్రదర్శించి ఉగ్రవాదులతో పోరాడి ఉంటే కొద్ది మంది మాత్రమే మరణించి ఉండేవారు.
చేతులు జోడించి బతిమాలితే ఉగ్రవాదులు వినే రకం కాదు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా, ఉగ్రవాద బాధితుల పట్ల సానుభూతి లేకుండా చేసిన రాజ్యసభ ఎంపీ చేసిన వ్యాఖ్యల పట్ల రాజకీయ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చీఫ్ సుప్రియా శ్రీనాథె బీజేపీ ఎంపీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పహల్గాం ఉగ్రదాడిలో తమ భర్తలను కోల్పోయిన మహిళల గురించి బీజేపీ ఎంపీ రామచంద్ర జంగ్రా చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పుపట్టారు.