లక్నో, అక్టోబర్ 23: సమోద్ సింగ్‌ది ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ జిల్లా. 15 రోజుల కింద వడ్లను వ్యవసాయ మార్కెట్‌కు తీసుకువచ్చాడు. తేమ, తాలు సాకుతో ప్రభుత్వ అధికారులు అతని వడ్లు కొనడానికి నిరాకరించారు. వడ్లను ఎండబోశాడు. తూర్పారబట్టాడు. అయినా ప్రభుత్వం అతని వడ్లు కొనలేదు. దయచేసి కొనాలని సమోద్ వేడుకొన్నాడు. అధికారుల నుంచి స్పందన లేదు. మార్కెట్ బయట అమ్ముదామంటే వ్యాపారులంతా సిండికేట్ అయ్యారు. ఎక్కడ అమ్మినా మద్దతు ధర ఇవ్వరు. పైగా మార్కెట్‌కు తీసుకురావడానికి వేలు ఖర్చు అయింది. మళ్లీ వేలు ఖర్చు చేసుకొని మార్కెట్ నుంచి వేరే చోటికి తరలించలేని పరిస్థితి. ప్రభుత్వం తీరుతో ఆ రైతు గుండె మండింది. కండ్లకు రక్తం వచ్చింది. చీడ పీడల బారి నుంచి కంటికి రెప్పలా పంటను కాపాడి, పండించిన వడ్లకు కన్నీటితో నిప్పు పెట్టాడు.
బీజేపీ సర్కార్‌పై విపక్షాల ధ్వజం
వడ్లరాశికి రైతు నిప్పు పెట్టిన ఘటనపై కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ స్పందించాయి. ‘బీజేపీ ప్రభుత్వం రైతులకు రెట్టింపు ఆదాయం ఇవ్వడం మాట అటుంచితే, ఇప్పుడు ఉన్న ఆదాయాన్ని కాపాడుకోవడానికి కూడా రైతులకు సహకరించడం లేదు. రైతులకు ఎరువులు అందించడం లేదు’ అని సమాజ్‌వాదీ పార్టీ ఆరోపించింది. యూపీలోని బీజేపీ ప్రభుత్వం రైతులను వేధిస్తున్నదని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ విమర్శించారు. వడ్ల కొనుగోలులో నిర్లక్ష్యం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కొనుగోళ్లు జరగకనే రైతు వడ్ల కుప్పకు నిప్పు పెట్టాల్సి వచ్చిందని, దీనికి ప్రభుత్వానిదే బాధ్యత అని స్పష్టంచేశారు. ఎరువుల కోసం రైతులు క్యూ లైన్లలో నిలబడి చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతు ధాన్యానికి రైతు నిప్పు పెడుతున్న వీడియోను స్వయంగా బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీనే ట్వీట్ చేశారు. ‘మనకు అన్నం పెట్టే రైతును కాపాడుకోలేకపోవడం దేశ ప్రజలందరి వైఫల్యం’ అని వ్యాఖ్యానించారు. దేశంలోని వ్యవసాయ విధానాలపై పునఃసమీక్ష చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సాగు చట్టాలను రైతులు వ్యతిరేకిస్తున్న వేళ బీజేపీ ఎంపీనే ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.
రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో రైతు.. తాను ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంటను అమ్ముకోలేక గుండె మండి, వడ్లరాశికి నిప్పు పెట్టిండు.
పొలాల్లోనే కాంటా వేసి మద్ద తు ధరకు ధాన్యం అమ్ముకొనే పరిస్థితులు తెస్తామన్న బీజేపీ అధికారంలో ఉన్న యూపీలోనే రైతు.. ప్రభుత్వ మార్కెట్ కేంద్రాల్లో ధాన్యం అమ్మడానికి నెలల తరబడి నిరీక్షిస్తున్నడు.
బీజేపీ అధికారంలో ఉన్న అదే ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల రైతుల మీదకు కేంద్ర మంత్రి కుమారుడి కారు ఎక్కింది. నలుగురు రైతులను టైర్ల కింద నలిపేసింది. వారి జీవితాలను చిదిమేసింది.