న్యూఢిల్లీ: కర్ణాటకలోని మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా (BJP MP Pratap Simha) గురువారం ఉదయం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. పార్లమెంట్ భద్రతను ఉల్లంఘించిన నిందితులకు పాస్‌లు జారీ చేయడంపై వివరణ ఇచ్చారు. నిందితుల్లో ఒకరి తండ్రి తనను కలిసినట్లు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా తెలిపారు. తన కుమారుడు కొత్త పార్లమెంటు భవనాన్ని సందర్శించాలనుకుంటున్నాడని ఆయన కోరినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో నిందితుడు సాగర్ శర్మ సందర్శకుల పాస్ కోసం తన వ్యక్తిగత సహాయకుడు (పీఏ), కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు. ఇంతకు మించి తన వద్ద ఎలాంటి సమాచారం లేదని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఆయన వివరించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
కాగా, బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా ద్వారా విజిటర్స్ పాసులు పొందిన సాగర్ శర్మ, మనోరంజన్ బుధవారం విజిటర్స్ గ్యాలరీ నుంచి లోక్‌సభలోకి దూకారు. పసుపు రంగు పొగ విడుదల చేసి సభ్యులను భయ భ్రాంతులకు గురిచేశారు. అప్రమత్తమైన ఎంపీలు వారిద్దరిని పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు.
మరోవైపు పార్లమెంట్ బయట కూడా పసుపు రంగు పొగ వెదజల్లి నిరసన తెలిసిన నీలమ్, అమోల్ షిండేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితులను విశాల్ శర్మ, లలిత్ గా గుర్తించారు. ఒకరిని అరెస్ట్ చేయగా పరారిలో ఉన్న మరో నిందితుడి కోసం వెతుకుతున్నారు. అయితే నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, మణిపూర్ హింస గురించి ఎంపీల దృష్టిని ఆకట్టుకునేందుకే స్మోక్ అటాక్‌కు పాల్పడినట్లు పోలీసులకు వారు వెల్లడించారు.