గువహటి, సెప్టెంబర్ 10: మణిపూర్‌లో కేంద్ర భద్రతా బలగాల తీరు వివాదాస్పదంగా మారింది. టెంగ్నోపాల్ జిల్లాలో భద్రతా బలగాల ‘అవాంఛిత కాల్పుల’కు ముగ్గురు అమాయక పౌరులు చనిపోగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనను ఖండిస్తున్నామని, భద్రతా బలగాల చర్యలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని బీరేన్‌సింగ్ సర్కార్ తాజాగా ప్రకటించింది. పౌరులపై భద్రతా బలగాల చర్యల్ని, అవాంఛిత కాల్పుల్ని ఖండిస్తున్నామని తెలిపింది.
ఇదిలా ఉండగా, భూమి కొనుగోలుపై బీజేపీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ ఇమో సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మణిపూర్ ల్యాండ్ రెవెన్యూ, ల్యాండ్ రీఫార్మ్స్ యాక్ట్-1960ని సవరించబోతున్నాం. కొండప్రాంతాల్లో గిరిజనేతరులు భూమి కొనుగోలు చేసే విధంగా కొత్త చట్టాన్ని తీసుకొస్తాం’ అని అన్నారు. దీనికి ఎమ్మెల్యేల సహకరించాలని లేఖలు రాశారు.