జైపూర్: బీజేపీ ఎమ్మెల్యే వివాదస్పదంగా ప్రవర్తించారు. మసీదు లోపల అభ్యంతరకరమైన పోస్టర్ను అంటించారు. ముస్లింలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆ బీజేపీ ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. (Case filed on BJP MLA) రాజస్థాన్ రాజధాని జైపూర్లో ఈ సంఘటన జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే బాల్ముకుంద్ ఆచార్య శుక్రవారం ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నారు. జామా మసీదు లోపలకు వెళ్లి వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని బెదిరించారు. అభ్యంతరకరమైన పోస్టర్ను అక్కడ అంటించారు.
కాగా, బీజేపీ ఎమ్మెల్యే ఆచార్య ప్రవర్తనపై స్థానిక ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జామా మసీదు వద్ద భారీగా నిరసన తెలిపారు. రాత్రి వరకు నిరసన కొనసాగించారు. బీజేపీ ఎమ్మెల్యే ఆచార్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అక్కడకు చేరుకుని ఈ నిరసనకు మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు. చివరకు బీజేపీ ఎమ్మెల్యే ఆచార్యపై కేసు నమోదు చేశారు. ఆయనపై దర్యాప్తు చేస్తామని పోలీస్ అధికారులు హామీ ఇచ్చారు. దీంతో ముస్లింలు నిరసన విరమించారు.