Subramanian Swamy | న్యూఢిల్లీ: బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘బీజేపీలో ఉన్న మనం మన పార్టీ టైటానిక్ నౌక మాదిరిగా మునిగిపోవాలని కోరుకుంటే, అందుకు సారథ్యం వహించడానికి మోదీ అత్యుత్తముడు. బీజేపీ శాశ్వతంగా మునిగిపోయేలా బీటలు వారుతున్నదని ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తున్నాయి’ అని ట్వీట్ చేశారు.
13 శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు శనివారం విడుదలైన సంగతి తెలిసిందే. వీటిలో 10 స్థానాలను ఇండియా కూటమి గెలుచుకుంది. బీజేపీ కేవలం రెండు స్థానాలను మాత్రమే దక్కించుకోగలిగింది. మరొక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో సుబ్రమణ్య స్వామి మోదీపై విమర్శలు గుప్పించారు.