న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో తర్వలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న బీజేపీ అభ్యర్థి రమేష్ బిధురి (Ramesh Bidhuri) వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో తాను గెలిస్తే కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా చెంపల మాదిరిగా తన అసెంబ్లీ నియోజకవర్గంలోని రోడ్లను నున్నగా చేస్తానని అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. ఢిల్లీ సీఎం అతిషిపై కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రమేష్ బిధురి ఆదివారం ఒక కార్యక్రమంలో మాట్లాడారు. ‘బీహార్ రోడ్లను హేమమాలిని చెంపల వలె నున్నగా చేస్తానని లాలూ యాదవ్ ఒకసారి ప్రస్తావించారు. కానీ ఆ వాగ్దానాన్ని నెరవేర్చడంలో ఆయన విఫలమయ్యారు. అయితే ఓఖ్లా, సంగమ్ విహార్‌లోని రోడ్లను మేం అభివృద్ధి చేశాం. అదే మాదిరిగా కల్కాజీలోని ప్రతి రహదారి ప్రియాంక గాంధీ చెంపల మాదిరిగా నున్నగా ఉండేలా చూస్తాం’ అని అన్నారు.
కాగా, బీజేపీ అభ్యర్థి రమేష్ బిధురి వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. ఆ పార్టీ నాయకురాలు సుప్రియా శ్రీనాట్ ఘాటుగా విమర్శించారు. ఆయన వ్యాఖ్యలు సిగ్గుచేటని అన్నారు. బీజేపీ మహిళా వ్యతిరేక ఆలోచనకు ఇది నిదర్శమని ఆరోపించారు. ‘ప్రియాంక గాంధీ గురించి రమేష్ బిధూరి చేసిన ప్రకటన సిగ్గుచేటు మాత్రమే కాదు, మహిళల పట్ల ఆయన అసహ్యకరమైన మనస్తత్వాన్ని కూడా చూపుతున్నది. తోటి ఎంపీపై పరుష పదజాలం వాడి ఎలాంటి శిక్ష అనుభవించని వ్యక్తి నుంచి ఇంకేం ఆశించాలి? బీజేపీ అసలు ముఖం ఇదే’ అని ఎక్స్‌లో విమర్శించారు.