రాయ్పూర్ : బీజేపీ సీనియర్ నేత, చత్తీస్ఘఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్ (Raman Singh) ఆదివారం అసెంబ్లీ స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. తాను విధాన సభను సరైన రీతిలో నడిపిస్తానని, చత్తీస్ఘఢ్కు సంబంధించిన అన్ని అంశాలనూ లేవనెత్తేలా సభ్యులకు సహకరిస్తానని నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ రమణ్ సింగ్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఛత్తీస్ఘఢ్ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత భూపేష్ బఘేల్ కూడా పాల్గొన్నారు. ఇక నూతనంగా కొలువుతీరిన చత్తీస్ఘఢ్ అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్గా రాంవిచార్ నేతం ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు.
సీఎం విష్ణుదేవ్ సాయి ఈ కార్యక్రమానికి హాజరు కాగా ప్రొటెం స్పీకర్గా తన విధులను సక్రమంగా నిర్వర్తిస్తానని ఈ సందర్భంగా నేతం పేర్కొన్నారు. రామానుజ్గంజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నేతం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక ఇటీవల వెలువడిన చత్తీస్ఘఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 90 స్ధానాలకు గాను బీజేపీ 54 స్ధానాల్లో గెలుపొందగా కాంగ్రెస్ 35 స్ధానాల్లో విజయం సాధించింది.
Read More :