న్యూఢిల్లీ: కేంద్ర విద్యుత్తు శాఖ మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఆర్కే సింగ్ బీహార్‌లోని తన సొంత ప్రభుత్వంపైనే సంచలన ఆరోపణలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మాజీ ఐఏఎస్ అధికారి కూడా అయిన ఆర్కే సింగ్ చేసిన ఈ ఆరోపణలు రాజకీయ దుమారాన్ని రేపాయి. రాష్ట్ర విద్యుత్తు రంగంలో రూ. 62,000 కోట్ల అవినీతి కుంభకోణం జరిగినట్లు సింగ్ ఆరోపించారు. చాలా ఎక్కువ ధరలకు ఓ ప్రైవేట్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విద్యుత్తు శాఖ ఒప్పందం కుదర్చుకుందని, దీని వల్ల రాష్ట్ర ఖజానాకు భారీ స్థాయిలో ఆర్థిక నష్టాలు చేకూరాయని బీహార్‌లోని అర్రాహ్కు చెందిన మాజీ ఎంపీ బీపీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోపించారు.
ఇది చాలా పెద్ద కుంభకోణం. యూనిట్‌కి రూ. 6.075 చొప్పున విద్యుత్తు శాఖ చెల్లించే విధంగా అదానీతో బీహార్ ప్రభుత్వం 25 సంవత్సరాలకు ఒప్పందం కుదుర్చుకుంది. అధిక ధరలకు విద్యుత్తు ప్లాంట్‌ను నెలకొల్పేందుకు అదానీ భారీ స్థాయిలో డబ్బు ముట్టచెప్పారు అని సింగ్ ఆరోపించారు. వచ్చే రెండు దశాబ్దాలకుపైగా భారీ లాభాలను కంపెనీ గడించగలదని ప్రభుత్వం అదానీ కంపెనీకి హామీ ఇచ్చిందని, రాష్ట్ర వినియోగదారులపై కృత్రిమంగా అధిక చార్జీలు విధిస్తామని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఆయన ఆరోపించారు.
ప్రజలపై యూనిట్‌కి రూ. 1.41 చొప్పున అదనపు భారం వేస్తున్నారని, ఇది రూ. 62,000 కోట్ల కుంభకోణమని ఆయన చెప్పారు. దీనిపై సీబీఐ దర్యాప్తు జరగాలని డిమాండు చేశారు. అయితే ఈ ఇంటర్వ్యూను ఎక్స్‌లో పోస్టు చేసిన ఏబీపీ న్యూస్ కొన్ని గంటలకే దీన్ని తొలగించడం చర్చనీయాంశమైంది. ఈ పోస్టును తొలగించడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆర్కే సింగ్ ప్రకారం బీహార్ ప్రభుత్వానికి, అదానీ కంపెనీకి మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఏడాదికి రూ. 2,500 కోట్ల మేరకు చెల్లింపులు జరుగుతాయి. ఇది 25 ఏళ్లకు దాదాపు రూ. 62,000 కోట్లు ఉంటాయి. రాష్ట్ర విద్యుత్ శాఖలోని పలువురు సీనియర్ అధికారులు విద్యుత్తు ఒప్పందం ముసుగులో అవినీతికి పాల్పడినట్లు సింగ్ ఆరోపించారు.