Jagadish Shettar | అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటకలో బీజేపీకి షాక్ తగిలింది. తనకు టికెట్ ఇవ్వలేదనే అసంతృప్తితో రగిలిపోతున్న మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ కాషాయ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తనకు టికెట్ ఇవ్వలేదనే విషయాన్ని చివరి వరకు దాచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డేను కలిసి తన రాజీనామా లేఖ సమర్పించారు. బీజేపీని వీడిన శెట్టర్ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరనున్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ పలువురు సీనియర్లను పక్కనబెట్టింది. 52 మందిని కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చింది. ఈ క్రమంలోనే మాజీ సీఎం జగదీశ్ శెట్టర్తో పాటు మంత్రి అంగారాకు కూడా టికెట్ నిరాకరించింది.
#WATCH | BJP leader & Former Karnataka CM Jagadish Shettar tenders his resignation as an MLA to Karnataka Assembly Speaker, Vishweshwar Hegde Kageri, at Sirsi. pic.twitter.com/v0RNQcdj6C
— ANI (@ANI) April 16, 2023
ఈ క్రమంలో శనివారం రాత్రి కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రదాన్, ప్రహ్లాద్ జోషి, కర్ణాటక సీఎం బొమ్మైతో జగదీశ్ శెట్టర్ చర్చలు జరిపారు. ఈ చర్చలు విఫలం కావడంతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనకు హుబ్లీ-ధార్వాడ సెంట్రల్ టికెట్ ఇవ్వకపోతే 20-25 సీట్లలో బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇంతటి అవమానాన్ని, మానసిక హింసను తన జీవితంలో ఎన్నడూ అనుభవించలేదని జగదీశ్ శెట్టర్ అన్నారు.
బీజేపీ నుంచి కాంగ్రెస్, జేడీఎస్లోని వలసలు శనివారం కూడా కొనసాగాయి. టికెట్ రాని సిట్టింగ్ ఎమ్మెల్యేలు మహదేప్ప యాదవాడ, అనిల్ బెనక కాంగ్రెస్ నేతలతో మంతనాలు సాగిస్తున్నారు. అరసికెరె నియోజకవర్గ బీజేపీ నేత సంతోష్ జేడీఎస్లో చేరి టికెట్ సంపాదించారు. కుమారస్వామి, భారతి శంకర్ కూడా జేడీఎస్ కండువా కప్పుకొన్నారు. మరికొందరు నేతలు కూడా కాంగ్రెస్, జేడీఎస్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు.