Devendra Fadnavis | ముంబై, డిసెంబర్ 4: మహారాష్ట్రలో పది రోజుల ఉత్కంఠకు తెరపడింది. కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్(54) పేరు ఖరారైంది. ఈ మేరకు బీజేపీ అధిష్ఠానం ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. దీంతో బుధవారం విధాన్ భవన్లో జరిగిన సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు ఆయనను బీజేపీ ఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కానున్నారని, మహారాష్ట్రలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడుతున్నట్టు బీజేపీ పరిశీలకులు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, విజయ్ రూపాని ప్రకటించారు.
దీంతో ఫడ్నవీస్, ఏక్నాథ్ సిండే, అజిత్ పవార్ నేతృత్వంలోని మహాయుతి ప్రతినిధి బృందం బుధవారం సాయంత్రం గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరింది. గురువారం సాయంత్రం 5.30 గంటలకు దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా మూడోసారి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ర్టాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.
ఫడ్నవీస్‌తో పాటు ఉప ముఖ్యమంత్రులుగా శివసేన నేత, మాజీ సీఎం ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ నేత అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునేందుకు మొదట షిండే మొండికేశారు. ఆయనను డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించాల్సిందిగా బీజేపీ అధిష్ఠానం, ఫడ్నవీస్ పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఆయన స్పందించలేదు. చివరకు బుధవారం సాయంత్రం అంగీకరించిన షిండే.. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తానని ప్రకటించారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ మూడోసారి ప్రమాణస్వీకారం చేస్తున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ తండ్రి గంగాధర్ ఫడ్నవీస్ జనసంఘ్, బీజేపీలో చురుగ్గా పని చేశారు. 1989లో ఏబీవీపీ ద్వారా విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశించిన ఫడ్నవీస్ 22 ఏండ్ల వయసులోనే నాగ్‌పూర్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 1997లో 27 ఏండ్లకే మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 1999 నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చిన ఆయన 2014లో మొదటిసారి మహారాష్ట్ర సీఎం అయ్యారు. 2019 నవంబర్ 23న రెండోసారి సీఎంగా ప్రమాణం చేసినా, సరిపడా శాసనసభ్యుల బలం లేకపోవడంతో మూడు రోజులకే రాజీనామా చేశారు. 2022 జూన్‌లో శివసేనలో షిండే తిరుగుబాటు చేసి సీఎం అయిన తర్వాత, ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు.
ప్రమాణస్వీకార కార్యక్రమం కోసం ముద్రించిన ఆహ్వానపత్రికల్లో ఫడ్నవీస్ పేరులో మార్పు కనిపించింది. ఇప్పటివరకు ఆయన పేరు దేవేంద్ర గంగాధర్ ఫడ్నవీస్ అని ఉండేది. ఫడ్నవీస్ తండ్రి గంగాధర్. ఎన్నికల అఫిడవిట్లలోనూ, గతంలో ప్రమాణస్వీకారం చేసినప్పుడు ఫడ్నవీస్ ఇదే పేరుతో చేశారు. ఈసారి మాత్రం ఆయన పేరును ‘దేవేంద్ర సరిత గంగాధర్‌రావు ఫడ్నవీస్’గా ముద్రించారు. ఫడ్నవీస్ తల్లి పేరు సరిత.
ఎన్సీపీ నేత అజిత్ పవార్‌ను ఉద్దేశించి మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. బుధవారం గవర్నర్‌ను కలిసిన తర్వాత ఫడ్నవీస్, షిండే, పవార్ కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం పదవిపై తన నిర్ణయాన్ని సాయంత్రం కల్లా చెప్తానని షిండే పేర్కొన్నారు. షిండేకు అడ్డుపడిన అజిత్ పవార్.. తాను మాత్రం ప్రమాణస్వీకారం చేస్తానని, షిండేకు సాయంత్రం వరకు తెలిసొస్తుందని వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన షిండే.. అజిత్ పవార్‌కు ఉదయం, సాయంత్రం ప్రమాణస్వీకారం చేసిన అనుభవం ఉందంటూ చురకలంటించారు. 2019లో ఎన్సీపీలో అజిత్ పవార్ తిరుగుబాటు చేసిన సంఘటనను గుర్తుచేస్తూ షిండే ఈ వ్యాఖ్యలు చేశారు. అప్పుడు ఫడ్నవీస్ సీఎం, అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా తెల్లవారుజామున ప్రమాణం చేశారు.