న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మోదీ సర్కారుపై కాంగ్రెస్ పార్టీ(Congress Party) విమర్శలు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మణిపూర్‌ను సందర్శించలేదని ప్రశ్నించింది. మహిళా రెజర్లపై బీజేపీ ఎంపీ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఆ అంశంపై ఎందుకు మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ ప్రశ్నించింది. మహిళలకు నివాళి అర్పించడం తప్ప ప్రధాని మోదీ వారి కోసం ఏమీ చేయరు అని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ అన్నారు. దేశంలోని మహిళలు ఆయన్ను కొన్ని ప్రశ్నలు వేస్తున్నారని, గత ఏడాది నుంచి మణిపూర్‌లో పౌర యుద్ధం నడుస్తోందని, బాధితుల్లో మహిళలు ఎక్కువగా ఉన్నారని, మహిళలపై దాడి జరిగిన ఘటనలకు చెందిన వీడియోలు రిలీజ్ అయ్యాయని, నగ్నంగా పరేడ్ చేయించారని, ప్రధాని మోదీ ఎందుకు ఆ రాష్ట్రాన్ని విజిట్ చేయడం లేదని జైరాం రమేశ్ ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, ఆయన మోదీ కుటుంబంలో సభ్యుడా అని నిలదీశారు. 2014లో అధికారంలోకి రాగానే బేటీ బచావో బేటీ పాడావో స్కీమ్‌ను ప్రభుత్వం ఆవిష్కరించిందని, కానీ మహిళ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయడం లేదని అన్నారు. బీజేపీ హటావో, బేటీ బచావో(BJP hatao, beti bachao) అని భారత్ మహిళలు డిమాండ్ చేస్తున్నారని రమేశ్ తెలిపారు.