(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారు పాలన నాణ్యతలేమికి కేరాఫ్‌గా మారింది. రూ. వేల కోట్లతో నిర్మిస్తున్న రోడ్లు, వంతెనలు, ఎక్స్‌ప్రెస్ హైవేలు, ఫ్లైఓవర్లు, రైల్వే బ్రిడ్జిలు, వాటర్ ట్యాంకులు ప్రారంభానికి ముందే పేకమేడల్లా కూలిపోతున్నాయి. నిన్న ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్ హైవే.. నేడు నాందేడ్-లాతూర్ ఫ్లైఓవర్ ప్రమాదాలు ‘డబుల్’ ఇంజిన్ సర్కారు నాసిరకపు పాలనకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. డబుల్ ఇంజిన్ ప్రభుత్వ పాలన ఉన్న రాష్ర్టాల్లో గడిచిన ఏడాది వ్యవధిలో జరిగిన ప్రమాదాల్లో కొన్ని..
జూలై 6, 2026: రూ. 6,695 కోట్లతో మహారాష్ట్రలో ఇటీవల నిర్మించిన ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వే మిస్సింగ్ లింక్‌ను రెండు నెలల కిందట ప్రారంభించారు. అయితే, నైరుతిలో తొలి వర్షానికి ఈ ఎక్స్‌ప్రెస్ హైవేపై గుంతలు పడింది. అంతేకాదు, కొండచరియలు విరిగిపడటంతో ఈ మార్గాన్ని తాత్కాలికంగా మూసేశారు.
మే 29, 2026: యూపీలోని హమీర్‌పూర్‌లో బేట్వా నది మీద నిర్మిస్తున్న ఓ వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు.
జనవరి 21, 2026: గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో 33 గ్రామాలకు రక్షిత మంచినీరు అందించే ఉద్దేశంతో రూ. 21 కోట్లతో నిర్మించిన ఓ వాటర్ ట్యాంకు ప్రారంభానికి ముందే కుప్పకూలిపోయింది. ముగ్గురు గాయపడ్డారు.
జూలై 9, 2025: గుజరాత్‌లోని వడోదరా జిల్లాలో గంభీర వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. వంతెనకు మరమ్మతులు చేపట్టకపోవడమే ప్రమాదానికి కారణమన్న ఆరోపణలు వచ్చాయి.
జూన్ 16, 2025: మహారాష్ట్రలోని పుణె జిల్లాలోని ఇంద్రాయణీ నదిపై ఉన్న ఇనుప వంతెన కూలిన ఘటనలో నలుగురు మృతి చెందారు.
జూన్ 1, 2026: ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ రైల్వే ఓవర్‌బ్రిడ్జి కూలిపోయింది. నాణ్యతాలోపాలే దీనికి కారణమని తెలిసింది.

జూలై 4, 2026: బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో గంగా నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జి స్లాబ్ కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

జూలై 9, 2025: రాజస్థాన్‌లోని జున్జును జిల్లాలో కొత్తగా నిర్మించిన ఓ రోడ్డు ప్రారంభోత్సవానికి ముందే నదీ ప్రవాహంలో కొట్టుకుపోయింది.

జూలై 9, 2026: మహారాష్ట్రలోని నాందేడ్-లాతూర్‌ను కలుపుతూ హైవేపై నిర్మించిన ఓ ఫ్లైఓవర్ ఇటీవలి వర్షానికి పూర్తిగా దెబ్బతిన్నది. ఫ్లైఓవర్ బ్రిడ్జిలోని ఒకవైపు భాగం కూలి సిమెంట్ కాంక్రీటులోపల ఉన్న మట్టి బయటకు వరదలా రావడం స్థానికులను కలవరపరిచింది. ఘటన జరిగిన సమయంలో వాహనాలేమీ ఫ్లైఓవర్ మీద లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
