Gujarat Model | అహ్మదాబాద్, జూన్ 11: కేంద్రంలోని బీజేపీ గొప్పగా చెప్పుకొనే డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఒరిగేదేమీ లేదని, డబుల్ ఇంజిన్ సర్కార్‌తో రాష్ర్టాలకు ట్రబుల్స్ తప్పవని మరోసారి నిరూపితమైంది. గుజరాత్ మాడల్ డొల్లతనం బయటపడింది. మూడు దశాబ్దాలుగా బీజేపీ ఏలుబడిలో ఉన్న గుజరాత్ మాడల్ కూలుతున్నది. వంతెనల రూపంలో బీజేపీ ప్రభుత్వం చేసిన అవినీతి బట్టబయలవుతున్నది. బీజేపీ హయాంలో నిర్మించిన వంతెనలు ఒక్కొక్కటిగా పడిపోతున్నాయి.
రాష్ట్రంలోని ప్రధాన నగరమైన అహ్మదాబాద్‌లో ఉన్న హత్కేశ్వర్ ఫ్లై ఓవర్‌ను కూల్చివేయాలని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకోవడమే గుజరాత్ మాడల్ పేక మేడలా కూలిపోతుందనడానికి నిదర్శనం. రాష్ట్రంలో నిరుడు మోర్బీ వంతెన కూలిన ఘటనలో 135 మందికిపైగా మరణించిన విషయం తెలిసిందే. దీంతో పాటు సబర్మతీ నదిపై నిర్మించిన అటల్ గాజు వంతెనకు పగుళ్లు వచ్చాయి. ప్రమాదం జరిగే ఆస్కారం ఉన్నప్పటికీ దీనిపైకి సందర్శకులను అనుమతిస్తూ ప్రజల ప్రాణాల మీదికి తెస్తున్నారు.
అటల్ గాజు వంతెనకు పగుళ్లు
ఎన్నికల ముందు హడావుడి…
2017లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో అహ్మదాబాద్‌లోని హత్కేశ్వర్ ప్రాంతంలో ఫ్లైఓవర్ పనులను తూతూమంత్రంగా చేసి హడావుడిగా దాన్ని ప్రారంభించారు. నాసిరకంగా పనులు చేయడంతో ఈ నిర్మాణం అనతి కాలంలోనే మరమ్మతులకు గురైంది. పిల్లర్లు కుంగిపోయాయి. 20 శాతం సామర్థ్యంతోనే ఫ్లైఓవర్ నిలిచి ఉందని, ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదం ఉందని ఐఐటీ రూర్కీ నివేదిక ఇచ్చింది. దీంతో కార్పొరేషన్ అధికారులు కూల్చివేతకు నిర్ణయించారు. ఈ ఘటనలో కంపెనీపై కేసులు నమోదు చేసి బీజేపీ పెద్దలు చేతులు దులుపుకొన్నారు.