భువనేశ్వర్: ఒడిశాలో (Odisha) కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం పేర్లు మార్పునకు శ్రీకారం చుట్టింది. ప్రసిద్ధ బీజూ పట్నాయక్ స్పోర్ట్స్ అవార్డును ఒడిశా స్టేట్ స్పోర్ట్స్ అవార్డుగా మార్చింది. అయితే నగదు బహుమతుల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ఒడిశా క్రీడలు, యువజన సేవల మంత్రిత్వ శాఖ ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘రాజ్య క్రీడా సమ్మాన్’ కోసం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి ఏటా ఎనిమిది క్రీడా విభాగాలలో ఈ అవార్డును ప్రదానం చేస్తారు.
కాగా, మార్గదర్శకాల ప్రకారం, క్రీడలను ప్రోత్సహించినందుకు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డుగా రూ. 3 లక్షలు, క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు రూ. 2 లక్షలు, కోచింగ్‌లో ప్రతిభ చూపిన వారికి లక్ష నగదు బహుమతిని అందజేస్తారు. అలాగే క్రీడల ప్రోత్సాహానికి ఉత్తమ సహకారం, స్పోర్ట్స్ జర్నలిజంలో అత్యుత్తమ ప్రతిభ, పారా స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్, అప్‌కమింగ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ (జూనియర్ కేటగిరీ), క్రీడల సాంకేతిక అధికారి, సహాయ సిబ్బంది వంటి ప్రతి విభాగంలో లక్ష నగదు పురస్కారం అందజేస్తారు. ప్రతి ఏటా ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్శంగా జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డులను అందజేస్తారు.
మరోవైపు ఒడిశాను 25 ఏళ్లు పాలించిన మాజీ సీఎం నవీన్ పట్నాయక్ ప్రవేశపెట్టిన అనేక పథకాల పేర్లను మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. రూరల్ బస్ సర్వీస్, మో బస్ సిటీ సర్వీస్ , రూ.5 భోజన పథకమైన ఆథార్ సహా బీజేడీ పాలనలోని అనేక ప్రసిద్ధ పథకాల పేర్లు మార్చాలని బీజేపీ ప్రభుత్వం యోచిస్తోంది.
కాగా, బీజేడీ సీనియర్ ఎమ్మెల్యే అరుణ్ సాహూ బీజేపీ చర్యను వ్యతిరేకించారు. అవార్డులు, పాత పథకాల పేర్లు మార్పు ‘ఒడిశా ప్రజలను బాధించే’ నిర్ణయమని విమర్శించారు. బీజూ పట్నాయక్ ఒక వ్యక్తి కాదని, ఒక సంస్థ అని అన్నారు. ‘ఆయన జాతీయ సంపద. మూడు దేశాలు ఆయనను గౌరవించాయి. క్రీడా అవార్డు నుంచి ఆయన పేరు తొలగించడం ద్వారా బీజేపీ ప్రభుత్వం ఏమి నిరూపించాలనుకుంటోంది?’ అని ప్రశ్నించారు.