PM Modi | న్యూఢిల్లీ, మార్చి 2: అధికార బీజేపీ లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించింది. సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి సంబంధించి 195 మంది అభ్యర్థులతో శనివారం తొలి జాబితా విడుదల చేసింది. ప్రధాని మోదీ మరోసారి ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి బరిలోకి దిగుతున్నారు. మొత్తంగా మొదటి విడత జాబితాలో ప్రస్తుత మోదీ క్యాబినెట్‌లోని 34 మంది మంత్రులకు చోటు దక్కింది. తొలి లిస్టులో 28 మంది మహిళలు, 47 మంది యువ నేతలు ఉన్నారు. అధికంగా యూపీలోని 51 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. తొలి జాబితాలోనే బీజేపీ అగ్రనేతలు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్ పోటీ చేయనున్న స్థానాలను ఖరారు చేయడం గమనార్హం. ఇక తొలి జాబితాలో తెలంగాణ నుంచి 9 మందిని ఎంపిక చేశారు.
కేంద్ర హోం మంత్రి అమిత్‌షా గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచే మళ్లీ పోటీచేస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మరో మంత్రి స్మృతి ఇరానీ వరుసగా యూపీలోని లక్నో, అమేథీ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇంకా ఈ తొలి లిస్టులో ఇతర కేంద్ర మంత్రులు మన్షుఖ్ మాండవీయ, జితేంత్ర సింగ్, సర్బానంద సోనోవాల్, గజేంద్ర షెకావత్, భూపేందర్ యాదవ్, కిరణ్ రిజిజు, జ్యోతిరాదిత్య సింధియా, రాజీవ్ చంద్రశేఖర్, అర్జున్ రామ్ మేఘ్వాల్, అర్జున్ ముండా చోటు దక్కించుకొన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తూ.. మోదీ నాయకత్వంలో కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని పార్టీ విశ్వాసంగా ఉన్నదని పేర్కొన్నారు. అభ్యర్థుల తొలి జాబితాను ఖరారు చేసేందుకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సహా ఇతర పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ(సీఈసీ) సభ్యులు గురువారం రాత్రి దాదాపు ఐదు గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు.
ఈ సారి ఎన్నికల బరిలో బీజేపీ ఇద్దరు మాజీ సీఎంలను రంగంలోకి దించింది. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌కు రాష్ట్రంలోని విదిశ టికెట్ కేటాయించగా..త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్‌ను త్రిపుర పశ్చిమ లోక్‌సభ స్థానం నుంచి అవకాశం కల్పించింది. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా రాజస్థాన్‌లోని కోటా నుంచి మరోసారి బరిలో దిగుతున్నారు.
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికారి బీజేపీకి చెందిన ఇద్దరు ఎంపీల ప్రకటనలు రాజకీయంగా సంచలనంగా మారాయి. తమను రాజకీయ, ప్రత్యక్ష ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించాలని తూర్పు ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్, జార్ఖండ్‌లోని హజారీబాగ్ ఎంపీ జయంత్ సిన్హాలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కోరారు. ఈ మేరకు ఇద్దరు నేతలు శనివారం కొద్ది గంటల వ్యవధిలో ఎక్స్ ఖాతాల్లో పోస్టులు చేశారు. రాజకీయ బాధ్యతల నుంచి తప్పిస్తే.. ఇతర బాధ్యతలపై పూర్తి దృష్టి పెట్టేందుకు అవకాశం ఉంటుందని వారు పేర్కొన్నారు. కాగా, ఈ ఇద్దరు నేతలకు ఈ సారి టికెట్ దక్కే అవకాశం లేదనే వార్తల నేపథ్యంలో ముందస్తుగా రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్టు సమాచారం.
ఢిల్లీలో ప్రకటించిన ఐదు స్థానాలకుగానూ నలుగురు సిట్టింగ్ ఎంపీలకు బీజేపీ టికెట్ నిరాకరించింది. వీరిలో రమేశ్ బిధూరి, పర్వేశ్ వర్మ, మీనాక్షి లేఖి, హర్ష్ వర్ధన్ ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వివాదాస్పద ఎంపీ సాధ్వి ప్రగ్యా ఠాకూర్‌కు పార్టీ ఈసారి మొండిచేయి చూపింది. ఇక కేంద్ర మాజీ మంత్రి, దివంగత సుస్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్‌ను న్యూఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎన్నికల బరిలోకి దింపుతున్నారు. టికెట్ దక్కని కేంద్ర మంత్రుల జాబితాలో మీనాక్షి లేఖి, జాన్ బర్లా ఉన్నారు. పశ్చిమబెంగాల్లోని అసన్సోల్ నుంచి భోజ్‌పురి గాయకుడు, నటుడు పవన్ సింగ్‌కు కమలం పార్టీ అవకాశం కల్పించింది.