న్యూఢిల్లీ, డిసెంబర్ 9: స్వచ్ఛ భారత్, బేటీ బచావో బేటీ పడావో, కిసాన్ సేవ వంటి ప్రభుత్వ కార్యక్రమాల పేరిట కొన్నేళ్ల క్రితం బీజేపీ ప్రజల నుంచి అక్రమంగా విరాళాలు వసూలు చేసినట్లు బయటపడింది. నమో యాప్, నరేద్రమోదీ.ఇన్ పోర్టల్‌లోని విరాళాల పేజీలలో ఇప్పటికీ ఆయా ప్రభుత్వ పథకాలకు విరాళాలు ఇవ్వచ్చన్న ఆప్షన్లు కనిపిస్తున్నాయి. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద చెన్నైకి చెందిన సీనియర్ జర్నలిస్టు, చానెల్ సత్యం టీవీ న్యూస్ ఎడిటర్ బీఆర్ అరవిందాక్షన్ అడిగిన ప్రశ్నలకు లభించిన జవాబులను బట్టి చూస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం విరాళాలు వసూలు చేసేందుకు కేంద్ర మంత్రులు లేదా ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంవో) నుంచి బీజేపీకి ఎటువంటి ప్రత్యేక అనుమతులు కాని అధికారం కాని లేవని అర్థమవువుతున్నది.
ది వైర్ కథనం ప్రకారం నరేంద్రమోదీ.ఇన్ వెబ్సైట్, నమో యాప్ వంటి ప్రైవేట్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా 2021 డిసెంబర్ నుంచి 2022 ఫిబ్రవరి మధ్య బీజేపీ విరాళాలు వసూలు చేసే కార్యక్రమం నిర్వహించింది. ప్రభుత్వ పథకాలైన స్వచ్ఛ భారత్, బేటీ బచావో బేటీ పడావో, కిసాన్ సేవ కోసం విరాళాలు ఇవ్వాలంటూ దాతలను బీజేపీ కోరింది. ఈ మూడు ప్రభుత్వ పథకాలలో ఒకదాన్ని ఎంచుకుని బీజేపీకి విరాళం అందచేయాలని వెబ్సైట్, యాప్ రెండూ కోరాయి. అయితే ఆర్టీఐ కింద అడిగిన ప్రశ్నలకు ఆయా పథకాలను అమలు చేస్తున్న మంత్రిత్వ శాఖలు మాత్రం స్పష్టమైన సమాధానాలిచ్చాయి.
ఈ పథకాల కోసం నిధులు వసూలు చేసేందుకు ఈ రెండు ప్లాట్‌ఫామ్స్‌కు కాని వ్యక్తులెవరికీ కాని ఎటువంటి ప్రత్యేక అనుమతి ఇవ్వలేదని ఆ మంత్రిత్వశాఖలు విస్పష్టంగా జవాబిచ్చాయి. 2021 డిసెంబర్ 25న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి నాడు పార్టీని బలోపేతం చేసేందుకు సూక్ష్మ విరాళాలు సేకరించే ప్రచారాన్ని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. ఈ ప్రచారం హిందూత్వ ప్రముఖుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి నాడు (2022 ఫిబ్రవరి 11న) ముగుస్తుందని ఆయన తెలిపారు. పార్టీని, ప్రజా ఉద్యమాలను బలోపేతం చేసేందుకు విరాళాలు సేకరించాలని నడ్డా ప్రకటించగా బీజేపీ నిర్మాణం కోసం పార్టీ నిధి ఇవ్వడం ఇష్టం లేకపోతే ప్రభుత్వ పథకాల కోసం విరాళాలు ఇవ్వాలని బీజేపీ కోరుతున్నట్లు దాతలు గుర్తించారు.
2021 డిసెంబర్ 25న ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ విరాళాల సేకరణ ప్రచారానికి ఆమోదం తెలియచేస్తూ బీజేపీ నిధి కోసం విరాళాలు అందచేయాలని తన అధికారిక ఎక్స్(అప్పటి ట్విట్టర్) హ్యాండిల్ ద్వారా దాతలను అర్థించారు. నడ్డాలాగే ప్రధాని మోదీ కూడా బీజేపీ నిధి కోసం తన రూ.1,000 విరాళం స్క్రీన్‌షాట్‌ను షేర్ చేయడంతో బీజేపీ మద్దతుదారులంతా అదే బాట పట్టారు. 2022 ఫిబ్రవరిలోనే ఈ ప్రచారం ముగిసినప్పటికీ ప్రభుత్వ పథకాల కోసం విరాళాలు ఇవ్వాలంటూ నరేంద్ర మోదీ.ఇన్ వెబ్సైట్, నమో యాప్‌లోని డొనేషన్ పేజీలు ఇప్పటికీ తలుపులు తెరుచుకునే ఉండడం విశేషం.
సత్యం టీవీ న్యూస్ ఎడిటర్ అరవిందాక్షన్ కూడా ఈ ప్రభుత్వ పథకాలకు ఇవే ప్లాట్‌ఫామ్స్ ద్వారా రూ.100 చొప్పున విరాళాలు ఇవ్వడంతోపాటు బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి ఈమెయిల్లో ఆన్లైన్ రసీదులు కూడా పొందారు. నరేంద్ర మోదీ.ఇన్ వెబ్సైట్, నమో యాప్‌లోని డొనేషన్ పేజీలలోని పేమెంట్ లింకులలో కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు కనిపించడంతో ఆ పథకాల కోసమే విరాళాల సేకరణ అని నమ్మి విరాళాలు చెల్లించానని, తనలాగే చాలా మంది పౌరులు నమ్మి విరాళాలు చెల్లించారని ఆయన తెలిపారు.
ఈ విరాళాల నిగ్గు తేల్చాలని భావించి ఆయా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్న కేంద్ర మంత్రిత్వ శాఖలకు అరవిందాక్షన్ 2022 జనవరి, ఫిబ్రవరిలో ఆర్టీఐ చట్టం ద్వారా పలుసార్లు ప్రశ్నలు సంధించారు. వీటికి ఆయా మంత్రిత్వ శాఖల నుంచి స్పష్టమైన సమాధానాలు వచ్చాయని, పూర్తిగా ప్రభుత్వ నిధులతో నడిచే ఈ సంక్షేమ పథకాల కోసం నిధులు వసూలు చేసేందుకు ఎవరికీ అధికారం కాని ప్రత్యేక అనుమతి కాని ఇవ్వలేదని తమ జవాబుల్లో మంత్రిత్వ శాఖలు స్పష్టం చేశాయని అరవిందాక్షన్ తెలిపారు.
ఏదైనా ఎన్జీవోకి కాని వ్యక్తులకు కాని ఈ ప్రభుత్వ పథకాల కోసం నిధులను వసూలు చేసేందుకు అనుమతించారా లేక నిధుల సేకరణ కోసం నమో యాప్‌కు కాని నరేంద్రమోదీ.ఇన్ వెబ్‌సైట్‌కు కాని ప్రత్యేక అనుమతి ఇచ్చారా అని ఆయన మూడు మంత్రిత్వ శాఖలను ప్రశ్నించారు. కేంద్ర జలశక్తి శాఖ(తాగు నీరు, పారిశుద్ధ్యం-స్వచ్ఛ భారత్ మిషన్-గ్రామీణ)కు అరవిందాక్షన్ పంపిన ఆర్టీఐ ప్రశ్నకు కేంద్ర పౌర సమాచార అధికారి(సీపీఐవో) సమాధానమిస్తూ స్వచ్ఛ భారత్ ప్రాజెక్టులకు నిధులు సమీకరించేందుకు ఏ ఎన్జీవోకి కాని వ్యక్తులకు కాని అనుమతి లేదని తెలిపారు.