Goa Assembly Results | దేశంలోకెల్లా చిన్న రాష్ట్రం గోవాలో బీజేపీ మూడోదఫా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నది. 40 స్థానాలు గల అసెంబ్లీలో సొంతంగా 20 స్థానాల్లో గెలిచిన బీజేపీ.. స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ 21 స్థానాలు. కానీ బీజేపీ గెలుపొందిన పలు స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థుల ఆధిక్యతలు 500 ఓట్ల లోపే. బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు విపక్షాల మధ్య చీలిపోవడం కమలనాథులకు నేరుగా లబ్ధి చేకూర్చింది. గోవాలో బీజేపీకి ఇది హ్యాట్రిక్ విక్టరీ. 2012లో మనోహర్ పారికర్ సారధ్యంలో తొలిసారి, 2017లో తిరిగి విజయం సాధించింది. ఈ దఫా పారికర్ లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం బీజేపీకి ఇబ్బందికరమైనా 2017 కంటే మెరుగైన ఫలితాలు సాధించింది.
మమతాబెనర్జీ సారధ్యంలోని తృణమూల్ కాంగ్రెస్, మహారాష్ట్ర గోమంతక్ పార్టీ (ఎంజీపీ)తో కలిసి పోటీ చేసింది. కేజ్రీవాల్ సారధ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 39 చోట్ల పోటీ చేసింది. ఫలితంగా తృణమూల్, ఆప్ అభ్యర్థులు.. కాంగ్రెస్ పార్టీ ఓటుబ్యాంకును కొల్లగొట్టారు. అంతకుముందు 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ 17, బీజేపీ 13 స్థానాల్లో గెలుపొందాయి. చిన్న పార్టీలతో కలిసి 2017లో ప్రభుత్వాన్నిఏర్పాటు చేసింది బీజేపీ. తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేల్లో ఇద్దరు మినహా అందరూ బీజేపీ గూటికి చేరుకున్నారు.
తాజా విజయంతో గోవా సీఎం ప్రమోద్ సావంత్ మరింత శక్తిమంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పారికర్ తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన సావంత్ ముందే పార్టీ నేతలు తిరుగుబాటు చేశారు. తాజా విజయంతో సావంత్ బలం పుంజుకున్నట్లయింది. ఇంతకుముందు తనను సవాల్ చేసిన వారిని సావంత్ క్యాబినెట్ నుంచి తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి.