Arvind Kejriwal | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బెయిల్పై విడుదలైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రెండురోజుల్లో రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఆయన రాజీనామా ప్రకటనతో ఢిల్లీ రాజకీయాలు వేడెక్కాయి. ఆయన రాజీనామా ప్రకటన కేవలం పీఆర్ స్టంట్గా బీజేపీ అభివర్ణించింది. కోర్టు విధించిన షరతుల కారణంగానే ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వస్తోందని బీజేపీ విమర్శించింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి మాట్లాడుతూ ‘ఇది అరవింద్ కేజ్రీవాల్ పీఆర్ స్టంట్. ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి పార్టీగా పేరుపొందింది. పీఆర్ స్టంట్తో మళ్లీ ఇమేజ్ను పెంచుకోవాలని భావిస్తున్నారు. మన్మోహన్ సింగ్ను డమ్మీ ప్రధానిని చేసి తెరవెనుక ప్రభుత్వాన్ని నడిపిన సోనియా నమూనానే అమలు చేయాలనుకుంటున్నట్లు స్పష్టమవుతోంది.
ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోతుంది. ఢిల్లీ ప్రజలు తన పేరుపై ఓట్లు వేయరని.. అందుకే వేరొకరిని బలిపశువును చేయాలనుకుంటున్నారు’ అంటూ విమర్శించారు. మరో నేత మంజీందర్ సింగ్ సిర్సా మాట్లాడుతూ రెండురోజుల తర్వాత రాజీనామా చేస్తానని.. ప్రజా నిర్ణయంతోనే మళ్లీ సీఎం అవుతానని ప్రకటించారన్నారు. ఇది త్యాగం కాదని.. సీఎం కూర్చిపై వెళ్లలేరని.. ఏ ఫైల్పైనా సంతకం చేయొద్దని సుప్రీం ఉత్తర్వుల్లో ఉందని.. ఆయనకు మరో అవకాశం లేదన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాజీనామా చేయాల్సి వస్తుందన్నారు. భార్యను ఢిల్లీ సీఎం చేసేందుకు ఎమ్మెల్యేలందరినీ ఒప్పించేందుకు కేజ్రీవాల్ రెండు రోజుల సమయం తీసుకుంటున్నారని విమర్శించారు.