న్యూఢిల్లీ : కశ్మీర్ పండిట్ల బహిష్కరణకు తాను బాధ్యుడినని తేలితే తనను దేశంలో ఎక్కడైనా ఉరితీయండని జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్ధుల్లా చేసిన వ్యాఖ్యలపై కాషాయ పార్టీ స్పందించింది. కశ్మీర్ పండిట్ల బహిష్కరణకు ఫరూక్ అబ్దుల్లానే బాధ్యుడని బీజేపీ ఆరోపించింది. కశ్మీర్‌ను హిందువులు 1989 నవంబర్ 1 నుంచి విడిచివెళ్లడం ప్రారంభించారని, 1990 జనవరి 18న జమ్మూ కశ్మీర్ సీఎంగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్ధుల్లా వైదొలగారని ఫరూక్ తీసుకవచ్చిన మైగ్రేంట్ ఇమ్మూవబల్ ప్రాపర్టీ యాక్ట్ ఇమేజ్ను షేర్ చేస్తూ బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ పేర్కొన్నారు.
కశ్మీర్లో నరమేధానికి తన తండ్రి ఫరూక్ అబ్ధుల్లా బాధ్యుడు కాదని ఒమర్ చెబుతున్న మాటలు అసత్యాలని ఆరోపించారు. 1989 నవంబర్ 1 నుంచి కశ్మీర్‌ను హిందువులు వీడుతుంటే సీఎంగా ఆయన రాజీనామా చేసిన 1990 జనవరి 18 వరకూ 79 రోజుల పాటు ఫరూక్ ఏం చేశారని మాలవీయ ట్వీట్ చేశారు. ఇక అంతకుముందు 1990లో జరిగిన ఘటనలకు తాను బాధ్యుడినని తేలితే దేశంలో ఎక్కడైనా తనను ఉరితీయవచ్చని అందుకు తాను సిద్ధమేనని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై నిజాయితీపరుడైన న్యాయమూర్తి లేదా నిబద్ధతతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తే వాస్తవాలు నిగ్గుతేలతాయని అన్నారు. కశ్మీరీ పండిట్ల బహిష్కరణకు ఫరూక్ అబ్దుల్లా బాధ్యుడని తేలితే తనను బహిరంగంగా ఉరితీయండని అన్నారు.
విచారణకు తాను సిద్ధమని ఈ ఘటనలతో సంబంధం లేనివారిని నిందించరాదని పేర్కొన్నారు. ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలనుకుంటే అప్పటి ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌తో లేదా అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్న ప్రస్తుత కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌తో మాట్లాడవచ్చని చెప్పారు. 1990ల్లో కశ్మీరీ పండిట్లతో పాటు సిక్కులు, ముస్లింలకు ఎదురైన అనుభవాలపై కమిషన్చే దర్యాప్తు చేపట్టాలని కోరారు. వివేక్ అగ్నిహోత్రి నిర్ధేశకత్వంలో వచ్చిన కశ్మీర్ ఫైల్స్ సినిమా ప్రచారం కోసం తీసిన మూవీ అని దుయ్యబట్టారు.