న్యూఢిల్లీ, జూన్ 20: గత ఏడాది దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ ఎంత ఖర్చు చేసిందనే వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) అనే సంస్థ వెల్లడించింది. మొత్తం ఎన్నికల వ్యయంలో 1,494 కోట్ల రూపాయలు (44.56 శాతం)ను అధికార బీజేపీ ఖర్చు చేసిందని ఏడీఆర్ శుక్రవారం తెలిపింది. ఆ తర్వాత 620 కోట్లు (18.5 శాతం)తో కాంగ్రెస్ ఉందని తెలిపింది. లోక్‌సభ, దానితో పాటు ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కింలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 32 జాతీయ, ప్రాంతీయ పార్టీలు కలిసి 3,352.81 కోట్ల రూపాయలను ఖర్చు చేశాయి. వీటిలో జాతీయ పార్టీల వాటా 2,204 కోట్లు (65.75 శాతం). అదే సమయంలో జాతీయ పార్టీలు రూ.6,930.246 కోట్లు, ప్రాంతీయ పార్టీలు 513.32 కోట్లు (6.92 శాతం) నిధులను సేకరించాయి. పార్టీ అభ్యర్థులు ఇచ్చిన ఎన్నికల వ్యయ వివరాల ఆధారంగా వీటిని వెల్లడించినట్టు ఏడీఆర్ తెలిపింది. అభ్యర్థులు ప్రచారం, ప్రయాణాలకు ఎక్కువ వ్యయం చేసినట్టు తమ లెక్కల్లో చూపారని పేర్కొంది.
45 రోజుల తర్వాత ఎన్నికల ఫుటేజీ తొలగించండి ; రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారులకు ఈసీ ఆదేశాలు
న్యూఢిల్లీ, జూన్ 20: దుర్మార్గపు, హానికర కథనాలు సృష్టించడానికి తమ ఎలక్ట్రానిక్ డాటాను ఉపయోగిస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రక్రియలకు సంబంధించిన సీసీటీవీ కెమెరా, వెబ్‌కాస్టింగ్, వీడియో ఫుటేజ్ సహా ఇతర డిజిటల్ డాక్యుమెంట్స్‌ను 45 రోజుల వరకు భద్రపర్చాలని రాష్ర్టాల ముఖ్య ఎన్నికల అధికారులను ఈసీ తాజాగా ఆదేశించింది. ఎన్నికల ఫలితాన్ని సవాల్ చేస్తూ 45 రోజుల్లోగా హైకోర్టుల్లో పిటిషన్ దాఖలైతే తప్ప, సంబంధిత నియోజకవర్గం డాటాను 45 రోజుల తర్వాత ధ్వంసం చేయవచ్చునని రాష్ర్టాల ముఖ్య ఎన్నికల అధికారులను ఈసీ ఆదేశించింది. ఈమేరకు మే 30న ఆయా రాష్ర్టాల సీఈసీలకు ఈసీ లేఖ రాసినట్టు తెలిసింది.