న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: స్కూళ్లు, కాలేజీల్లో అడ్మిషన్లు, ఉద్యోగ దరఖాస్తులు, ఆధార్ అప్లికేషన్, డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు.. ఇలా ప్రతి అప్లికేషన్‌ను ఒక్కోచోట ఒక్కోరకమైన పత్రాలు అడుగుతుంటారు. వాటిని సంపాదించలేక నానా తంటాలు పడుతుంటాం. ఇక ఈ ఇబ్బందుల నుంచి మోక్షం రాబోతున్నది. ప్రభుత్వ, ప్రైవేటు పనులకు సంబంధించి దేనికోసం దరఖాస్తు చేసుకోవాలన్నా ఒక్క జనన ధృవీకరణ పత్రం ఉంటే సరిపోతుంది. ఏ దరఖాస్తుకైనా అదొక్కటే ప్రధాన ఆధారం. ఈ నిబంధన వచ్చే నెల ఒకటోతేదీ నుంచే అమల్లోకి రాబోతున్నది. కేంద్రప్రభుత్వం సవరించిన రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ అండ్ డెత్స్ (అమెండ్మెంట్) యాక్ట్-2023 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రాబోతున్నదని కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది.
ఈ చట్టం ప్రకారం విద్యాసంస్థల్లో దరఖాస్తులకు, ఉద్యోగ అప్లికేషన్లకు, అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకొనేందుకు, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకొనేందుకు.. ఇలా ఏ అవసరానికైనా జనన ధృవీకరణ పత్రం ఒక్కటి సరిపోతుంది. ఇందుకోసం రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా పౌరుల జనన, మరణాల డాటాబేస్‌ను నిర్వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నియమించే చీఫ్ రిజిస్ట్రార్, స్థానిక సంస్థల పరిధిలో పనిచేసే రిజిస్ట్రార్లు ఎప్పటికప్పుడు ప్రజల జనన, మరణాల వివరాలను రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకు పంపుతారు. రాష్ట్రస్థాయిలో కూడా డాటాబేస్‌ను నిర్వహిస్తారు.