రాంచీ: ఆదివాసీల ఆరాధ్యదైవం, గిరిజన వీరుడు బిర్సా ముండా(Birsa Munda) ముని మనవడు మంగల్ ముండా ఇవాళ మృతిచెందారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అతను ఓ ఆస్పత్రిలో చికిత్స పొందారు. అయితే గుండెపోటు రావడంతో ఆయన ప్రాణాలు విడిచారు. మంగల్ ముండా వయసు 45 ఏళ్లు. అర్థరాత్రి 12.30 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచారు. రాంచీలో ఉన్న రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఆయన మృతిచెందారు. జార్ఖండ్‌లోని ఖుంతి జిల్లాలో జరిగిన ప్రమాదంలో.. వాహనం రూఫ్ మీద నుంచి మంగల్ ముండా కిందపడిపోయారు.
నవంబర్ 25వ తేదీన ఆ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడ్డ అతనికి వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించామని, కానీ సక్సెస్ కాలేకపోయినట్లు రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ హీరన్ బిరువా తెలిపారు. ప్రధాన మంత్రి కార్యాలయం, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి, జార్ఖండ్ సీఎంవో.. రిమ్స్ ఆస్పత్రితో టచ్‌లో ఉన్నారు.