Bira 91 : యువతలో ఎంతో ఆదరణ పొందిన క్రాఫ్ట్ బీర్ (Craft Beer) బ్రాండ్ ‘బీరా 91 (Bira 91)’ ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో ఉంది. కంపెనీ పేరులో చేసిన ఒక చిన్న మార్పు ఆ బ్రాండ్ పతనానికి కారణమైంది. పేరు మార్పుతో అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి. దాంతో నష్టాలు భారీగా పెరిగాయి. ఫలితంగా ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది. చివరికి ఒక విజయవంతమైన స్టార్టప్ మూతపడే దశకు చేరుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల బీరా 91 మాతృ సంస్థ ‘బి9 బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్’ తన చట్టపరమైన పేరును ‘బి9 బేవరేజెస్ లిమిటెడ్’గా మార్చింది. పేరు చివర ఉన్న ‘ప్రైవేట్’ అనే పదాన్ని తొలగించడం అతిపెద్ద సమస్యకు దారితీసింది. ఈ మార్పును కొత్త కంపెనీగా పరిగణించిన వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, బీరా 91 బీర్ అమ్మకాలను నిలిపివేశాయి. కొత్త పేరుతో మళ్లీ అన్ని రకాల అనుమతులు, లైసెన్సులు, ప్రోడక్ట్ రిజిస్ట్రేషన్లు పొందాలని ఆదేశించాయి.
ఈ అధికారిక జాప్యం కంపెనీని కోలుకోలేని దెబ్బతీసింది. కాగా ఈ పరిణామంపై ఇన్వెస్టర్ డీ ముత్తుకృష్ణన్ స్పందిస్తూ.. ఒక చిన్న లోపం మొత్తం కంపెనీని ఎలా కూల్చివేస్తుందో చెప్పడానికి బీరా 91 ఒక ఉదాహరణ అన్నారు. సమస్యల కారణంగా అన్ని రాష్ట్రాలు అమ్మకాలను నిషేధించాయని చెప్పారు. దాంతో అసలు సమస్య మొదలైందని తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
పేరు మార్పువల్ల నెలల తరబడి అమ్మకాలు నిలిచిపోయి కంపెనీ ఆర్థికంగా కుప్పకూలింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు 22% పడిపోగా, నష్టాలు 68% పెరిగి రూ.748 కోట్లకు చేరాయి. కంపెనీ మొత్తం ఆదాయం రూ.638 కోట్లు కాగా.. నష్టాలు అంతకుమించి ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. అమ్మకాలు లేకపోవడంతో సుమారు రూ.80 కోట్ల విలువైన స్టాక్‌ను కంపెనీ రద్దు చేసుకోవాల్సి వచ్చింది.
జూలై నుంచి ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. ఈ క్రమంలో రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన ‘బ్లాక్‌రాక్’ లాంటి సంస్థ కూడా వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఈ సంక్షోభం ఉద్యోగులపైనా తీవ్ర ప్రభావం చూపింది. దాదాపు 250 మందికిపైగా ఉద్యోగులు కంపెనీ వ్యవస్థాపకుడు అంకుర్ జైన్‌ను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. మూడు నుంచి ఐదు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని, సరఫరాదారులకు బిల్లులు కూడా చెల్లించలేదని ఆరోపించారు.
ఈ ఆరోపణలపై స్పందించిన అంకుర్ జైన్, ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలో జాప్యం జరిగిన మాట వాస్తవమేనని అంగీకరించారు. పేరు మార్పు, మద్యం పాలసీలలో మార్పులు, నిధుల సమీకరణలో జాప్యం వంటి కారణాలవల్ల గత 18 నెలలుగా కంపెనీ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోందని తెలిపారు.