చెన్నై: దేశవ్యాప్తంగా వైద్య విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) నుంచి తమిళనాడు రాష్ట్రానికి మినహాయింపు కోసం డీఎంకే ప్రభుత్వం తెచ్చిన బిల్లును ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి తిరస్కరించారు. గత ఏడాది అసెంబ్లీలో ఆమోదించిన ఆ బిల్లును ప్రభుత్వానికి తిప్పిపంపారు. గ్రామీణ, పేద విద్యార్థుల ప్రయోజనాలకు ఇది విరుద్ధంగా ఉన్నదని పేర్కొన్నారు.
ఇటీవల రిపబ్లిక్ డే ప్రసంగం సందర్భంగా ఈ బిల్లుపై గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నీట్ అమలులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల నమోదు గణనీయంగా పెరిగిందని అన్నారు. ‘నీట్ ప్రవేశానికి ముందు, ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రభుత్వ వైద్య కాలేజీల్లో సీట్లు పొందే విద్యార్థులు ఒక శాతమైనా ఉండేవారు కాదు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 7.5 శాతం రిజర్వేషన్ కల్పించిన చర్యకు ధన్యవాదాలు. దీని వల్ల ఆ సంఖ్య గణనీయంగా మెరుగుపడింది’ అని గవర్నర్ తెలిపారు.
మరోవైపు వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే అర్హత పరీక్ష ‘నీట్’ను తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. గత ఏడాది నీట్ పరీక్ష రాసిన పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో గ్రామీణ, వెనుకబడిన తరగతుల విద్యార్థులకు నీట్ వల్ల చాలా నష్టం జరుగుతున్నదని డీఎంకే ప్రభుత్వం పదే పదే చెబుతున్నది. ప్రైవేట్‌గా కోచింగ్ తీసుకునే స్థోమత ఉన్న విద్యార్థులు మాత్రమే నీట్ పాసవుతున్నారని పేర్కొంది.
నీట్ వల్ల రాష్ట్ర హక్కుల ఉల్లంఘన కూడా జరుగుతున్నదని డీఎంకే ప్రభుత్వం ఆరోపిస్తున్నది. ఈ నేపథ్యంలో ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రానికి నీట్ నుంచి మినహాయింపు కోరుతూ గత ఏడాది సెప్టెంబర్ నెలలో బిల్లును తెచ్చింది. అసెంబ్లీలో ఆమోదం పొందిన ఈ బిల్లు గవర్నర్ వద్దకు వెళ్లగా తాజాగా ఆయన దానిని ప్రభుత్వానికి తిప్పిపంపారు.