Bilkis Bano’s Rape Case | బిల్కిస్ బానోపై లైంగిక దాడి కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న 11 మంది దోషులను గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. వారిపై బీజేపీ ఎమ్మెల్యే సీకే రావుల్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. `బ్రాహ్మణులు` `మంచి సంస్కారం` కలిగి ఉంటారని గోధ్రా ఎమ్మెల్యే రావుల్జీ అన్నారు. 15 ఏండ్లుగా జైలు జీవితం అనుభవిస్తున్న వారిని విడుదల చేయడం పట్ల దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ.. దోషులకు సీకే రావుల్జీ మద్దతుగా నిలిచారు. జైలు నుంచి విడుదలైన తర్వాత పూలదండలు వేసి వారితో కలిసి తీపి మిఠాయిలు పంచుకున్నారు.
బాల్కిస్ బానోపై లైంగిక దాడి కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న దోషుల విడుదల విషయమై గుజరాత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇద్దరు బీజేపీ నేతల్లో సీకే రావుల్జీ ఒకరు. లైంగిక దాడి దోషులను విడుదల చేయాలని ఈ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నది. దోషుల్లో ఒకరు తమను విడుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. దేశ సర్వోన్నత న్యాయస్థానం.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వదిలేసింది.
`వారు ఏదైనా నేరం చేశారా.. లేదా.. అన్నది నాకు తెలియదు. కానీ, నేరం చేయాలనే ఉద్దేశం ఉండాలి` అని సీకే రావుల్జీ అన్నారు. `బ్రాహ్మణులకు మంచి సంస్కారం ఉంటుంది. ఒకవేళ కొందరు ఏదైనా తప్పు చేస్తే శిక్షించాల్సిందే` అని వ్యాఖ్యానించారు. దోషులు జైలులో మంచి ప్రవర్తనతో మెలిగారని అన్నారు. సీకే రావుల్ జీ వ్యాఖ్యల ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.