పాట్నా, జూలై 17: ఎన్డీఏ పాలిత బీహార్‌లో రోజురోజుకూ శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. రాష్ట్రంలో కేవలం 14 రోజుల్లో 50 హత్యలు జరగడం చూస్తే పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయో తెలుస్తున్నది. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో ప్రతి రోజు మూడు నాలుగు హత్యలు, దోపిడీ ఘటనలు జరుగుతుండటం ప్రజలను భీతావహులను చేస్తున్నది. హత్యలతో రాష్ట్రం అట్టుడుకుతున్నా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పందించడం లేదు. కాగా, ఈ హత్యలు అంత ఎక్కువేం కాదని, గతంతో పోలిస్తే తక్కువేనని డీజీపీ సమర్థించుకోవడం గమనార్హం.
రాజధాని పాట్నాలో మరోహత్య సంచలనం సృష్టించింది. శాస్త్రినగర్ పరిధిలో ఉన్న పారస్ హాస్పిటల్లోకి గురువారం నలుగురు వ్యక్తులు బైక్‌లపై వచ్చారు. తుపాకులతో దవాఖానలోకి ప్రవేశించిన వారు అక్కడ చికిత్స పొందుతున్న ప్రత్యర్థి గ్యాంగ్ సభ్యుడిపై కాల్పులు జరిపి, తాపీగా నడుచుకుంటూ బయటకు వెళ్లిపోయారు. గాయపడిన వ్యక్తిని ఐసీయూకు తరలించి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది.
హాస్పిటల్లో హత్యపై ఎన్డీయేలో భాగస్వామి, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ తీవ్రంగా స్పందించారు. బీహార్‌లో హత్యలు నిత్యకృత్యంగా మారాయిని, నేరగాళ్ల ఆత్మవిశ్వాసం రోజురోజుకు పెరిగిపోతున్నదని, దవాఖానలో హత్య ద్వారా నేరగాళ్లు శాంతి భద్రతలకే సవాల్ విసిరారని ఆయన అన్నారు. కాగా, బీహార్‌లో హత్యలపై పాశ్వాన్ స్పందించడం ఈ నెలలో రెండోసారి. రాష్ట్రంలో పరిస్థితులపై ఈనెల 12న స్పందించిన ఆయన ఈ హత్యలకు ఇంకా ఎంతమంది బీహారీలు బలైపోవాలని ప్రశ్నించారు.