పాట్నా: ఒక ప్రైవేట్ స్కూల్ డైరెక్టర్ కుమారుడు రెండేళ్ల పాటు విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. (school director’s son rapes girl) ఇది గుర్తుకు వచ్చినప్పుడల్లా బాధిత బాలిక మూర్ఛపోయేది. తల్లిదండ్రులు ఆమెను మానసిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా ఐదేండ్ల తర్వాత ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. బీహార్‌లోని సహార్సా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 2017లో 12 ఏండ్ల బాలిక ఒక ప్రైవేట్ స్కూల్లో చదివింది. ఆరో తరగతిలో ఉండగా స్కూల్ ఫీజు చెల్లించలేదన్న కారణంతో మహిళా ప్రిన్సిపాల్ ఆ బాలికను లైబ్రరీ గదిలోకి తీసుకెళ్లింది. లైటు స్విచ్ ఆఫ్ చేయడంతోపాటు డోర్‌ను లాక్ చేసింది. లోపల ఉన్న స్కూల్ డైరెక్టర్ కుమారుడు ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనిని వీడియో తీశాడు. ఆ బాలికను బెదిరించి రెండేళ్లపాటు లైంగిక దాడి కొనసాగించాడు.
కాగా, బాధిత బాలిక భయంతో దీని గురించి ఎవరికీ చెప్పలేదు. తల్లిదండ్రులను ఒప్పించి బాలికల స్కూల్లో చేరింది. అయితే ఎవరితో కలువకుండా ముభావంగా ఉండేది. 2022లో ఇంటర్ తర్వాత నీట్ ప్రిపరేషన్ కోసం పాట్నాకు వెళ్లింది. హాస్టల్లో ఉన్నప్పుడు స్కూల్ డైరెక్టర్ కుమారుడి లైంగిక దాడులు గుర్తుకు వచ్చినప్పుడల్లా భయంతో మూర్ఛపోయేది. చివరకు హాస్టల్మేట్కు జరిగిన దారుణం గురించి చెప్పింది. అయితే ఎవరికీ చెప్పవద్దని బతిమాలింది.
మరోవైపు ఒక రోజు ఆ స్కూల్లో పరిచయమైన వ్యక్తి నుంచి ఆ యువతికి ఫోన్ వచ్చింది. మాటల సందర్భంగా స్కూల్ డైరెక్టర్ కుమారుడు పాట్నాలో ఉన్నట్లు తెలిసింది. అనంతరం ఆ బాలికకు వరుసగా మూర్ఛలు వచ్చాయి. వెంటనే పాట్నాలోని ఎమర్జెన్సీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆందోళనతో పాట్నా చేరుకున్నారు. ఆ యువతి మానసికంగా ఆందోళన చెందుతున్నదని డాక్టర్లు తెలిపారు. మానసిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లాలని సూచించారు.
కాగా, ప్రస్తుతం 17 ఏండ్ల వయసున్న కుమార్తె పదే పదే మూర్ఛపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. చివరకు ఆగస్ట్ 23న మానసిక వైద్యుడి వద్దకు ఆమెను తీసుకెళ్లారు. దీంతో 2017 నుంచి రెండేళ్లపాటు జరిగిన దారుణం గురించి ఆమె నోరు విప్పింది. ఈ నేపథ్యంలో బాధిత యువతి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు చివరకు స్కూల్ డైరెక్టర్ కుమారుడు, మహిళా ప్రిన్సిపాల్‌ను అరెస్ట్ చేశారు.
అయితే ఇలాంటి దారుణాలు ఎదుర్కొన్న బాలికలు ధైర్యంగా ముందుకు వచ్చి వాటిని బయటపెట్టాలని పోలీస్ అధికారి సోషల్ మీడియాలో పిలుపునిచ్చారు. ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ స్వాతి మలివాల్ కూడా దీనిపై స్పందించారు. ఈ కేసుకు సంబంధించి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు శుక్రవారం లేఖ రాశారు.
बिहार के सहरसा में बच्ची के साथ स्कूल के डायरेक्टर का बेटा 2 साल तक बलात्कार करता रहा। स्कूल की प्रिंसिपल ने भी आरोपी की मदद की। बच्ची के परिवार ने हमें कंप्लेंट भेजी है। अभी तक कोई मुआवज़ा और लीगल ऐड तक नहीं मिली है। ।इस बेहद संगीन मामले में नीतीश कुमार जी को पत्र भेजा है। pic.twitter.com/6mvqxwrWzb
— Swati Maliwal (@SwatiJaiHind) September 15, 2023