JP Nadda : బీహార్ ఎన్నికలను (Bihar Elections) ఎన్డీయే ‘వికాసానికి’, ఇండియా కూటమి ‘వినాశనానికి’ మధ్య జరుగుతున్న పోరుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు (BJP president), కేంద్ర మంత్రి జేపీ నడ్డా (JP Nadda) చెప్పారు. భాగస్వామ్య పక్షాలను అంతంచేసే పరాన్నజీవి పార్టీగా ఆయన కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. లాలూప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) నేతృత్వంలోని ఆర్జేడీ.. రంగ్దారీ (దోపిడీ), జంగల్‌రాజ్ (ఆటవిక పాలన), దాదాగిరీ (దౌర్జన్యం) లకు ప్రతీక అని విమర్శించారు.
బీహార్‌లోని ఔరంగాబాద్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. తాను పట్నాలోనే పుట్టానని, బీహార్లోనే 20 ఏళ్లు గడిపానని చెప్పారు. ఆర్జేడీ చీకటి యుగం గురించి తనకు తెలుసని నడ్డా పేర్కొన్నారు. యువతకు ఉపాధి కల్పిస్తామని, వలసలను అడ్డుకుంటామని తేజస్వీ యాదవ్ ఇచ్చిన హామీలు ‘భూమికి ఉద్యోగం కుంభకోణం’లో ఆర్జేడీ ప్రమేయాన్ని గుర్తుచేస్తున్నాయని విమర్శించారు.
మాజీ గ్యాంగ్‌స్టర్ షహబుద్దీన్ తనయుడు ఒసామాకు రఘునాథ్పుర్ నుంచి టికెట్ ఇవ్వడంపై మండిపడ్డారు. బీహార్ విషయంలో ఆ పార్టీకి ఎంత శ్రద్ధ ఉందో ఇది తేటతెల్లం చేస్తుందన్నారు. తేజస్వి యాదవ్ ఆచరణలో సాధ్యంకాని హామీలు ఇస్తున్నారని బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. ‘2.6 కోట్ల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని తేజస్వి చెబుతున్నారు. దీనికి రూ.12 లక్షల కోట్లు అవసరమవుతాయి. రాష్ట్ర మొత్తం బడ్జెట్ దాదాపు రూ.3 లక్షల కోట్లు. మరి ఎక్కడి నుంచి ఉద్యోగాలు కల్పిస్తారు?’ అని ప్రశ్నించారు. ఓటర్లకు ఆర్జేడీ తప్పుడు వాగ్దానాలు ఇస్తోందని, ఆ పార్టీని రాష్ట్ర ప్రజలు విశ్వసించరని చెప్పారు.